సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి.. ఈ పీఠం విశిష్టత ఇదే..

మంగళగౌరి దేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు చేకూరతాయని హిందువులు నమ్ముతారు.

సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి.. ఈ పీఠం విశిష్టత ఇదే..

Sarvamangala Devi

Updated On : September 15, 2025 / 10:45 PM IST

Sarvamangala devi: సర్వమంగళా దేవి/మంగళగౌరి దేవి బిహార్‌లోని గయలో వెలసింది. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు ఈ ప్రాంతంలోనే పడ్డాయి. మంగళగౌరి దేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు చేకూరతాయని హిందువులు నమ్ముతారు.

వివాహిత మహిళలు, కొత్తగా పెళ్లైన నవ వధువులు ఎంతో ఇష్టంగా మంగళగౌరీ వ్రతాన్ని చేస్తుంటారు. ముఖ్యంగా శ్రవాణమాసంలో మంగళగౌరీని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు చెబుతారు.

అంతటి విశిష్ట కలిగిన మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయాన్ని పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, దేవీ భాగవత పురాణం, మార్కండేయ పురాణం, ఇతర రచనలలో ఈ దేవాలయం ప్రస్తావించారు. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మించారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని మంగళగౌరి కొండపై నిర్మించారు.

మెట్లు లేదా రహదారి గుండా కొండపైకి చేరుకోవచ్చు. ఆలయం ముందు ఒక చిన్న నాట్య మండపం ఉంది. ప్రాంగణంలో హోమం నిర్వహించడం కోసం హోమ గుండం ఉంది. మంగళగౌరి ఆలయం ఇటుకలతో నిర్మింపబడిన చిన్న ఆలయం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మంటపం, హోమగుండం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు ఆయనకు ఎదురుగా నంది దర్శనమిస్తారు. గర్భగుడి చాలా చిన్నగా ఉంటుంది.

లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారంనాడు విశేషంగా అమ్మవారి దర్శనం కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేష పూజలు, ఉత్సహావాలు జరుగుతాయి.