Site icon 10TV Telugu

శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?

తిరుమల తిరుపతి శ్రీవారి “లడ్డూ కల్తీ” పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ఇవాళ తిరుమలకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదని అన్నారు.

న్యాయస్థానం ముందున్న సమాచారం ఆధారంగా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. కల్తీ తయారీలో వాడిన నెయ్యి గురించి రిపోర్టు వచ్చిన తేదీ విషయంలో మాత్రమే కాస్త తికమక ఉందని తెలిపారు. అసలు ప్రసాదం విషయంలోనే కాకుండా వైసీపీ పాలనలో ఇటువంటి ఉల్లంఘనలు చాలా జరిగాయని అన్నారు. తమ సర్కారు వాటిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

సుమారు 219 దేవాలయాలను అపవిత్రం చేశారని, రామతీర్థంలో శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. తన దీక్ష సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లడానికేనని తెలిపారు. తాను ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేశాక దీనిపై డిక్లరేషన్ చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని అన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, దానిపై అంతగా మాట్లాడనని పవన్ చెప్పారు.

కాగా, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్.. తిరుమల చేరుకున్నారు. ఇవాళ అలిపిరి వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు.

అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారం పూర్తవుతుంది.

Chandrababu Naidu: జగన్ వెళ్తూ వెళ్తూ ఇలా చేసి వెళ్లారు: చంద్రబాబు

Exit mobile version