Tirumala : కొండపైకి వారికి నో ఎంట్రీ.. తిరుమల నడకదారిలో మొదలైన ఆంక్షలు

కొత్త ఆంక్షలతో నడకమార్గం మీదుగా తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య కొంతవరకు తగ్గింది. క్రూరమృగాలు, జంతువుల దాడి నుంచి.. Tirumala New Rules

Tirumala New Rules

Tirumala New Rules : చిన్నారిపై చిరుత దాడి చేసి చంపిన నేపథ్యంలో తిరుమల నడకదారుల్లో (అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు) టీటీడీ కొత్త ఆంక్షలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 12ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2గంటల తర్వాత అలిపిరి నడకమార్గంలో కొండపైకి అనుమతించబోమని టీటీడీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అలాగే సాయంత్రం తర్వాత ద్విచక్రవాహనాలు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదు.

ఇక నడక మార్గంలో భక్తులకు ఊతకర్ర అందించాలనే నిర్ణయాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నారు. కొత్త ఆంక్షలతో నడకమార్గం మీదుగా తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య కొంతవరకు తగ్గింది.

ఒకవైపు చిరుతలు, మరోవైపు ఎలుగుబంట్లు.. నడకదారి భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక చిరుత ఓ చిన్నారిపై దాడి చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా భక్తుల్లో భయం నింపింది. భక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ ఘటన తర్వాత అలిపిరి నడకమార్గం అంటేనే భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భక్తుల భద్రత కోసం టీటీడీ కొన్ని కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.

Also Read..Tirumala : మధ్యాహ్నం 2గంటల వరకే వారికి అనుమతి, ప్రతి భక్తుడికి ఊతకర్ర- చిరుత దాడితో నడకదారిపై టీటీడీ కీలక నిర్ణయాలు

12ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలను కలిగున్న కుటుంబీకులను మధ్యాహ్నం 2గంటల తర్వాత కొండపైకి అనుమతించరు. ఎందుకంటే, వీళ్లు నడిచి వెళ్లేసరికి చీకటి పడుతుంది. దీంతో పిల్లల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత కొండపైకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పెద్ద పిల్లలు ఉన్న వారిని మాత్రం రాత్రి 10గంటల వరకు నడకమార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇక సాయంత్రం పూట ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.

మరో అత్యంత ముఖ్యమైన నిర్ణయం నడకదారిలో కొండపైకి వెళ్లే భక్తులకు ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది టీటీడీ. సాధారణంగా అటవీ మార్గంలో పయనించే వారు చేతిలో ఒక దుడ్డుకర్ర పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. గతంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లే వారు కూడా తలా ఒక కర్ర చేతిలో పట్టుకుని వెళ్లేవారు. క్రూరమృగాలు, జంతువుల దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇలా కర్రలు తీసుకుని అడవి మార్గంలో వెళ్లేవారు. సరిగ్గా అదే పాతపద్ధతిని టీటీడీ ఇవాళ మళ్లీ తెరపైకి తెచ్చింది.

Also Read..Leopard: బాబోయ్ మరో చిరుత..! తిరుమల కాలినడక మార్గంలో ఇంకో చిరుతపులి.. ఎలుగుబంటిసైతం ప్రత్యక్షం..

ఇక, నడకమార్గంలో దారి మధ్యలో ఉన్న దుకాణాల దగ్గర కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఎవరూ కూడా దుకాణాల వద్ద తినుబండారాలు కానీ తిని మిగిలిపోయిన ఆహారపదార్దాలను పారవేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరిస్తోంది. దుకాణదారులు అందరూ పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సీరియస్ గా చెప్పింది. దుకాణ సముదాయాలు దగ్గరలో ఉన్న చోట్లలోనే ఇప్పటివరకు చిరుతలు దాడులు చేశాయి. అంటే, ఆ దుకాణాల కోసం పిల్లలు ఆగడం, ఆ పిల్లలపై అటాక్ చేయడం వంటి ఘటనలు జరిగాయి.

నడకమార్గం అంటే ఎంతో ఆహ్లాదకరమైన, పచ్చదనంతో కూడుకున్న ప్రయాణంగా ఇప్పటివరకు భావిస్తూ వచ్చాం. కానీ, ఎప్పుడైతే చిరుతలు ఇలా దాడి చేసి మనుషులను తినే స్థాయివరకు వెళ్లిందో ఒక్కసారిగా మొత్తం వ్యవహారాన్ని పున:సమీక్షించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ కొన్ని కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది. పిల్లలతో వచ్చే భక్తులను మధ్యాహ్నం 2గంటల తర్వాత నడకదారిలో వెళ్లేందుకు అనుమతించకపోవడం, సాయంత్రం పూట బైక్స్ ను నిషేధించడం కొంతవరకు తమకు ఇబ్బందికరమే అంటున్నారు భక్తులు. కానీ భక్తుల భద్రత కోసం కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయకతప్పడం లేదంటన్నారు అధికారులు.