SVBC చైర్మన్ పృథ్వీ చిత్రపటం దహనం : రంగంలోకి టీటీడీ విజిలెన్స్

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ ఆడియో టేపుల వ్యవహారం టీటీడీలో కలకలం రేపింది. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పృథ్వీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై వివాదం ముదరడంతో టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఆడియో టేపుల వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అంతర్గత విచారణ చేస్తోంది. అసలేం జరిగింది? లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజమెంత? ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లోబర్చుకున్నారా? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
మరోవైపు పృథ్వీ వ్యవహార శైలిని ఖండిస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. పృథ్వీ చిత్రపటాన్ని దహనం చేశారు. పృథ్వీని వెంటనే ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన సినీ నటుడు పృథ్వీ వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ కలకలం రేపుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉండే ఎస్వీబీసీ ఛానల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీ వేంకటేశ్వరుడికి సేవ చేయడానికి ఉపయోగపడే పవిత్రమైన పదవిలో ఉండి పృథ్వీ నిజంగా ఇలాంటి పని చేశారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏ రోజు జరిగిందో కూడా తెలియడం లేదు. ఒకవేళ ఈ ఆడియో టేప్ నిజమని తేలితే మాత్రం పృథ్వీపై వేటు పడే అవకాశాలున్నాయి. నిజానిజాలు తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ఈ ఆడియో టేప్ వైరల్‌గా మారింది.
అమరావతిలో ఆందోళనలు చేపట్టిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులతో పృథ్వీ పోల్చడం తీవ్ర వివాదాస్పదమైంది. వైసీపీ నేత, సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి.. పృథ్వీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వైసీపీ అధిష్టానం కూడా పృథ్వీపై సీరియస్ అయ్యింది. ఈ వివాదం సద్దుమణకముందే.. మరో కాంట్రవర్సీలో పృథ్వీ చిక్కుకున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : CAAతో మహాత్ముడి కల సాకారం : మళ్లీ చెబుతున్నా.. పౌరసత్వం ఇచ్చేది, రద్దు చేసేది కాదు