Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

తునిపై మళ్లీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సిద్ధమవుతోంది. సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవన్నంతా వాడుతున్నారు.

Tuni Assembly Constituency: తుని.. ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట. రెండు దశాబ్దాలకు పైనే పసుపు జెండా ఎగిరిన చోటు. అలాంటి నియోజకవర్గం.. ఇప్పుడు అధికార వైసీపీకి అడ్డాగా మారిపోయింది. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన వైసీపీ.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తోంది. అయితే.. తునిపై మళ్లీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సిద్ధమవుతోంది. బలాన్ని పుంజుకొని.. విజయాన్ని సాధించేందుకు సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవన్నంతా వాడుతున్నారు. సెంటిమెంట్‌తో పాటు యువతరానికి అవకాశమిచ్చేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అధికార వైసీపీ తునిలో హ్యాట్రిక్ కొడుతుందా? లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మొత్తంగా.. ఈసారి తునిలో కనిపించబోయే సీనేంటి?

కాకినాడ జిల్లాలో.. కాకినాడ తర్వాత అతిపెద్ద నియోజకవర్గం తుని. చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు వాణిజ్య, వ్యాపార కేంద్రంగా కొనసాగుతోంది ఈ ప్రాంతం. 1952లో ఏర్పడిన తుని అసెంబ్లీ సెగ్మెంట్‌కు.. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయ్. అందులో.. ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇక.. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. వరుసగా ఆరు సార్లు గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009 ఎన్నికల్లో.. టీడీపీ కంచుకోట బద్దలైంది. అప్పుడు.. కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు గెలిచారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం హవా కనిపించడంతో.. తునిపై మళ్లీ టీడీపీ పట్టు సాధిస్తుందనుకున్నారు. కానీ.. అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనంలో.. తునిలో వరుసగా రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలున్నాయి. అవి.. తుని, కోటనందూరు, తొండంగి. వీటి పరిధిలో.. మొత్తంగా 2 లక్షల 12 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. తునిలో అభ్యర్థుల గెలుపోటములను ప్రధానంగా 4 సామాజికవర్గాలు డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో.. కాపు సామాజికవర్గం ఓట్లు 50 వేల దాకా ఉన్నాయి. అలాగే.. యాదవుల ఓట్లు సుమారుగా 30 వేలు, వెలమల ఓట్లు 30 వేలు, ఎస్సీ, ఎస్టీల ఓట్లు 45 వేల దాకా ఉన్నాయి. వీళ్లే.. పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తారు.

దాడిశెట్టి రాజా (Photo: FB)

2014లో రాష్ట్రమంతా తెలుగుదేశం గాలి వీచినా.. తునిలో మాత్రం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దాడిశెట్టి రాజా (Dadisetty Raja) విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనే గెలిచారు. 2014లో గెలిచినా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో.. అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని.. మరోసారి చాన్స్ ఇవ్వాలంటూ జనంలోకి వెళ్లి.. గెలిచారు. ఇప్పుడు ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర్నుంచి.. నియోజకవర్గంలో తన క్యాడర్‌ని, బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక.. జగన్ సర్వేలోనూ.. మంత్రి రాజాకు మంచి మార్కులే పడినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లోనూ.. ఆయనకే టికెట్ కన్ఫామ్ అనే టాక్ వినిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధిస్తారని.. కార్యకర్తలు అంటున్నారు.

మోతుకూరు వెంకటేశ్ (Photo: FB)

ఇక.. దాడిశెట్టి రాజా తన సొంత క్యాడర్‌లోని మోతుకూరు వెంకటేశ్ (Venkatesh Mothukuri) అనే వ్యక్తి.. అవినీతికి పాల్పడ్డారని.. అందరికీ చెప్పి అతన్ని దూరం పెట్టారు. సొంత వాళ్లు తప్పు చేసినా ఊరుకునేది లేదని.. అది తమ ప్రభుత్వం తీరని.. జనంలోకి ఓ ప్రచారాన్ని వదిలారు. అయితే.. సొంత మనుషుల్ని బహిరంగంగా విమర్శిస్తే వచ్చే మంచి పేరుతో పాటు క్యాడర్‌లో కొంత చెడ్డపేరు మూటకట్టుకున్నారనే విమర్శలున్నాయ్. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లో దాడిశెట్టి రాజా విజయంలో.. మోతుకూరు వెంకటేశ్ కీలకంగా వ్యహరించారని కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పుడు అతన్ని దూరం పెట్టడంతో.. నియోజకవర్గంలో మంత్రి రాజా బలం కొంతైనా తగ్గుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం.. వెంకటేశ్ సైలెంట్‌గానే ఉన్నా.. ఎన్నికల నాటికి అతను ఏ పార్టీ వైపు చూస్తారో.. ఆ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయ్. ఇక.. సంక్షేమ పథకాల అమలు తప్ప.. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తునిని పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే టాక్ కూడా వినిపిస్తోంది. గెలిచే అవకాశాలున్నా.. ఇప్పుడున్న బలం ఆయనకు సరిపోదేమోననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.

యనమల కృష్ణుడు (Photo: FB)

తెలుగుదేశం విషయానికొస్తే.. కాకినాడ జిల్లాలో తుని ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. రెండు దశాబ్దాలకు పైనే యనమల రామకృష్ణుడు.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. వరుసగా ఆరు సార్లు విజయం సాధించి.. తుని రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారి 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు (yanamala rama krishnudu ఓడిపోయారు. దాంతో.. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తర్వాత.. తన రాజకీయ వారసుడిగా తమ్ముడు యనమల కృష్ణుడిని బరిలోకి దించారు. 2014, 2019 ఎన్నికల్లోనూ.. కృష్ణుడు ఓటమిపాలయ్యారు. తునిలో.. ఆరు సార్లు టీడీపీ గెలిచిందనే వ్యతిరేకత ఉన్నందు వల్లే.. మొదటిసారి ఓడిపోయానన్నారు. తర్వాత.. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో.. మరోసారి ఓటమి తప్పలేదని చెప్పారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే.. పక్కాగా గెలుస్తానని.. టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు యనమల కృష్ణుడు (yanamala krishnudu). అయితే.. ఇటీవల కాలంలో తుని టీడీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయ్. యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను.. తుని టీడీపీ ఇంచార్జ్‌గా పాలిటిక్స్‌లోకి దించారు. దాంతో.. అన్నదమ్ముల మధ్య టికెట్ విషయంలో.. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ్. కొన్నాళ్ల ముందు వరకు.. ఎవరికి వారు సీటు కోసం రాజకీయం మొదలుపెట్టారు. తానే టికెట్ దక్కించుకోవాలని.. కృష్ణుడు ప్రయత్నిస్తే.. కూతురికి సీటు ఇప్పించుకునేందుకు రామకృష్ణుడు రాజకీయంగా చక్రం తిప్పారు.

తన తండ్రి రామకృష్ణుడితో యనమల దివ్య (Photo: Twitter)

తుని నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు తెలుగుదేశం (Telugu Desam) ఓటమిపాలైంది. దాంతో.. మళ్లీ బలం పుంజుకునేలా.. పార్టీని బలోపేతం చేసేందుకు.. నేతలంగా ఎవరికి వారు కష్టపడుతున్నారు. అయితే.. యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు మధ్య తలెత్తిన సీటు పంచాయతీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దాంతో.. వాళ్లిద్దరినీ పిలిపించుకొని మాట్లాడారు. పరిస్థితుల్ని చక్కదిద్దారు. అలా.. తుని టీడీపీ ఇంచార్జ్‌ పదవి యనమల దివ్య (yanamala divya)కు ఇచ్చారు. అప్పట్నుంచి.. ఆవిడ జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. చివరి నిమిషంలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో తెలియదు కాబట్టి.. యనమల కృష్ణుడు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. తనకు అవకాశం ఇస్తే.. రెండు సార్లు ఓడారన్న సానుభూతి ఉందని.. సింపతీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు. అప్పట్నుంచి.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా.. అన్న కూతురు దివ్యకు మద్దతుగా ఉంటానని చెబుతున్నారు.

రాజా అశోక్ బాబు (Photo: FB)

ఇక.. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పోటీ చేశారు. ఆయనకు.. స్వల్ప ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాజా అశోక్ బాబు (Raja Ashok Babu) పెద్దగా ప్రజల్లోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించిన దాఖలాల్లేవు. అశోక్ బాబు.. ఇటీవలే జనసేనను వీడి తెలుగుదేశం అధినేత చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత కూడా ఆయన జనంలో పెద్దగా కనిపించలేదు. తునిలో ఆఖరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రాజ అశోక్ బాబుకి సొంతంగా క్యాడర్ ఉన్నా.. పాలిటిక్స్‌కి మాత్రం దూరంగా ఉంటున్నారు. దాంతో.. ప్రస్తుతం నియోజకవర్గంలో జనసేనకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉన్నా.. నడిపించే నాయకుడే లేడు. దాంతో.. తుని ఎన్నికల్లో టీడీపీ, జనసేన (Jana Sena) కలిసి పోటీ చేసినా.. విడివిడిగా పోటీ చేసినా.. పెద్దగా ప్రభావం ఉండదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు.. ఎన్నికల నాటికి ఏ పార్టీ ఉంటారన్నది కూడా ఆసక్తిగా మారింది.

Also Read: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

తాజా పరిస్థితులను గమనిస్తే.. తుని రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయ్. అధికార వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజాకు.. నియోజకవర్గంలో కాస్త అనుకూల వాతావరణమే కనిపిస్తోంది. అయినప్పటికీ.. టీడీపీ నుంచి గట్టి పోటీ తప్పేలా కనిపించడం లేదు. దాంతో.. తునిలో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలోనే పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. నియోజకవర్గంలో అధికార వైసీపీ, మంత్రి దాడిశెట్టి రాజా.. హ్యాట్రిక్ కొడతారా? లేక.. టీడీపీ విజయం సాధిస్తుందా? అనేది.. ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు