ఎన్నిక చిన్నదే. ఎలక్షన్ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. రెండు జడ్పీటీసీ సీట్లకు వచ్చిన ఉప ఎన్నికలు కడప రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. అసలే వైసీపీ అధినేత జగన్ కంచుకోట. అందుకే కడప గడపలోని రెండు జడ్పీటీసీ సీట్లకు జరగబోయే బైఎలక్షన్స్ మీద సీరియస్‌గా కాన్సంట్రేషన్ చేసింది టీడీపీ. జగన్ ఇలాకలో ఆయనకు ఝలక్ ఇచ్చి..రాబోయే స్థానిక సంస్థలకు ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లకు బూస్టింగ్ ఇవ్వాలని స్కెచ్ వేస్తోంది సైకిల్ పార్టీ.
తొలి గడపలో ఆసక్తికర రాజకీయాలకు తెరదీస్తోంది. పులివెందుల జడ్పీటీసీ సీటు జగన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి కీలకమైన స్థానం. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం కడప పార్లమెంట్‌లో వైసీపీ సిట్టింగ్ సీటు. ఈ రెండు చోట్ల గెలిచి వైసీపీకి..జగన్‌కు షాక్ ఇవ్వాలనేది కూటమి స్కెచ్. అందుకోసం పులివెందులలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది టీడీపీ. అటు వైసీపీ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని వాడటంతో పాటు..జగన్ ఇమేజ్‌తో గెలిచి సత్తా చూపించాలని ప్లాన్ చేస్తోంది. ఏకంగా ఎంపీ అవినాశ్‌రెడ్డే పులివెందుల జడ్పీటీసీ బైఎలక్షన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి అన్నీ తానై పనిచేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉండేలా కూడా ప్రణాళిక రచిస్తున్నారని..ప్రచారం ముగిసే నాటికి ఉన్న రాజకీయ పరిస్థితులు, పబ్లిక్ మూడ్‌ను బట్టి జగన్ టూర్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ ఇస్తామంటున్నారు.
Also Read: మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్.. పీసీసీ చీఫ్ రివర్స్ గేమ్
ఒంటిమిట్ట జడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ సీటుకు ఉప ఎన్నిక తప్పలేదు. ఇక పులివెందుల జడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైఎలక్షన్ వచ్చింది. పులివెందులలో వైసీపీ తరఫున మహేశ్వర్‌రెడ్డి భార్య ఉమా దేవి, కొడుకు భరత్ నామినేషన్ వేశారు. టీడీపీ తరఫున బీటెక్ రవి భార్య లతారెడ్డి, సోదరుడు జయభరత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో నిలుస్తున్నారు. అయితే తమ సిట్టింగ్ సీట్లను తిరిగి నిలబెట్టుకోవాలని వైసీపీ పెద్ద వ్యూహమే రచిస్తోంది.
టీడీపీ అయితే రెండు జడ్పీటీసీ స్థానాల్లో గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకే ఎదురే ఉండదని జగన్‌కు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలేలా స్కెచ్ వేస్తోంది. ఈ రెండు జడ్పీటీసీ సీట్లు టీడీపీకి ఇప్పుడు పెద్దగా బలం కాకపోవచ్చు. కానీ ఈ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ మాత్రం రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై గట్టిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అటు టీడీపీ..ఇటు వైసీపీ ప్రెస్టేజ్ కా సవాల్ తీసుకుంటున్నాయి. కంచుకోటలో రెండుసీట్లను కోల్పోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని..పైగా వైసీపీ బలహీనపడిందని..జగన్ సొంత ఇలాకలోనే గెలవలేకపోయారనే సంకేతాలు వెళ్తాయని.. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది ఫ్యాన్ పార్టీ.
కడప జడ్పీలో మెజారిటీ స్థానాలు వైసీపీకి ఉండడంతో జడ్పీ పీఠాన్ని సైతం వైసీపీ ఖాతాలో వేసుకుంది. బ్రహ్మంగారిమఠం మండల జడ్పీటీసీ రామ గోవిందరెడ్డి జెడ్పీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికీ కడప జడ్పీలో సంఖ్యాబలం వైసీపీకే ఉంది. అయితే పులివెందుల జడ్పీటీసీ సీటును ఏకగ్రీవం చేసేందుకు జగన్ స్కెచ్ వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పులివెందుల పరిధిలోని ఆర్.తుమ్మలపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి గతంలో పులివెందుల జడ్పీటీసీగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
టీడీపీకి వైసీపీ రిక్వెస్ట్?
ఆయన సతీమణి ఉమాదేవిని రంగంలోకి దింపడం ద్వారా సానుభూతితో పాటు మృతుడి భార్యకు టికెట్ ఇచ్చినందుకు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వాలని టీడీపీని కోరే ప్రయత్నాల్లో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ నేతలు మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకగ్రీవం అవకాశం లేకపోతే పులివెందులలో మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ నేతలు ఉండడంతో జడ్పీటీసీ స్థానం చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కూటమి పార్టీ నేతలు బల ప్రదర్శన కోసం గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నాయి. వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోస్థానం ఒంటిమిట్టలో మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
రాజంపేట ఎమ్మెల్యేగా వైపీపీ తరఫున ఆకేపాటి అమర్నాథరెడ్డి కొనసాగుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఒంటిమిట్ట స్థానాన్ని తిగిరి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ఒంటిమిట్ట కంటే పులివెందుల జడ్పీటీసీ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది టీడీపీ. పులివెందుల జడ్పీటీసీ సీటును గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామంటున్నారు బీటెక్ రవి. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుబోతున్న కొత్తపల్లికి చెందిన పుష్పనాథ్ రెడ్డితో తమకు కొంత బలం యాడ్ అవుతుందని భావిస్తోంది టీడీపీ.
గతంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న పుష్పనాథ్ రెడ్డి చేరితే..పులివెందుల సీటును ఈజీగా గెలుచుకోవచ్చనేది తెలుగు తమ్ముళ్ల వ్యూహమంటున్నారు. ఏదైనా రెండు జడ్పీటీసీ సీట్లు ఉప ఎన్నికలంటే..ఓ ఎమ్మెల్యే సీటు గెలుపోటములను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా త్వరలో స్థానిక సమరం రాబోతుండటంతో ఈ రెండు జడ్పీటీసీ సీట్లు..ఇటు వైసీపీకి అటు టీడీపీకి చాలా ఇంపార్టెంట్‌గా మారాయి. గెలిచి వైసీపీ సత్తా చాటుతుందా.? జగన్ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ జెండా ఎగరేస్తుందా చూడాలి మరి.