మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్.. పీసీసీ చీఫ్‌ రివర్స్‌ గేమ్

పార్టీ ప‌రంగా ఏం చేయాల‌న్నా అది పీసీసీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర పూర్తిగా ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కాన్సెప్ట్‌.

మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్.. పీసీసీ చీఫ్‌ రివర్స్‌ గేమ్

Updated On : August 1, 2025 / 8:36 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంట్రెస్టింగ్‌ ప‌రిణామాలు హాట్ టాఫిక్‌గా మారాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతలే ప్రజా స‌మ‌స్యలు తెలుసుకునేందుకంటూ పాద‌యాత్ర స్టార్ట్ చేయ‌డంపై చర్చనీయాంశం అవుతోంది. పైగా పాదయాత్ర చేస్తున్నది రాష్ట్ర కాంగ్రెస్ నేత కాదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ ప్రతిరోజు సాయంత్రం పాదయాత్రం చేయడం చర్చకు దారితీస్తోంది. మీనాక్షి పాద‌యాత్రపై కాంగ్రెస్‌ పార్టీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. పాదయాత్ర కాన్సెప్ట్‌ పూర్తిగా మీనాక్షి నటరాజన్‌దేనని చెప్పారు కాంగ్రెస్‌ నేతలు.

అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పాదయాత్ర ఆలోచనను మానుకోవాలని కోరారట కాంగ్రెస్ పెద్దలు. కానీ మీనాక్షి పాద‌యాత్ర విష‌యంలో తగ్గేదేలేదని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడ్డారట. ఫైన‌ల్‌గా పాద‌యాత్ర స్టార్ట్ అయ్యే టైమ్‌కు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. తాను చేస్తున్న పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ పాల్గొంటున్నారని చెప్పుకొస్తున్నారు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్.

Also Read: పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేశ్‌ కీరోల్.. ఏం జరుగుతోంది?

పాద‌యాత్ర అంశం అంతా ఇన్‌చార్జ్ మీనాక్షి చుట్టూ తిరుగుతుండ‌టంతో..పీసీసీ చీఫ్ ప్రకటనతో సీన్‌ మారిపోయింది. రెండు, మూడు రోజులు మీనాక్షి సెంట్రిక్‌గా చర్చ జరిగిన పాద‌యాత్ర ఎపిసోడ్‌ ఆల్ ఆఫ్ స‌డెన్‌గా పీసీసీ చీఫ్ వైపు మారిపోయింది. పాద‌యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందుగా పీసీసీ చీఫ్ చేస్తున్న పాద‌యాత్రగా మార్చేశారు. పాద‌యాత్రకు కూడా జ‌న‌హిత‌గా మార్చి.. పీసీసీ చేస్తున్న పాద‌యాత్రలో ఇన్‌చార్జ్ మీనాక్షి పాల్గొంటార‌ని చెప్పుకొచ్చారు. అయితే ఇలా మార‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేద‌ట‌. పాద‌యాత్రలో భాగంగా ప్రజా స‌మ‌స్యలు తెలుసుకోవ‌డం..ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడం.. కార్యక‌ర్తల‌తో భేటీ అవ‌డం వంటి అంశాలున్నాయి.

పాద‌యాత్ర పూర్తిగా ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కాన్సెప్ట్‌
పార్టీ ప‌రంగా ఏం చేయాల‌న్నా అది పీసీసీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తున్న పాద‌యాత్ర పూర్తిగా ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కాన్సెప్ట్‌. ఇంచార్జ్ ఆలోచ‌న అయిన‌ప్పటికీ..పార్టీ ప‌రంగా తానే ముందు ఉండ‌క‌పోతే..మున్ముందు ఇబ్బందులు త‌ప్పవనే ఆలోచ‌న చేశార‌ట‌. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని రూట్‌ మార్చేశారట. అందుకే పార్టీ పూర్తిగా త‌న కంట్రోల్‌లో ఉండాలంటే తానే ముందుండాల‌నే ఆలోచ‌న చేశార‌ట‌ పీసీసీ చీఫ్‌. పార్టీ సీనియ‌ర్లు ఇచ్చిన సూచనలతో జ‌న‌హిత పాద‌యాత్రను ముందుండి నడిపిస్తున్నారట పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌ గౌడ్.

పార్టీపై ప‌ట్టు సాధించేందుకు పీసీసీ చీఫ్ ప్లే చేసిన ట్యాక్టింక్స్‌ చ‌ర్చనీయాంశంగా మారాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ హైక‌మాండ్ దగ్గర ఫుల్ ప‌వ‌ర్ క‌లిగిన నాయకురాలు. మీనాక్షిని నేరుగా ఎదిరించ‌డం సాధ్యం కాని ప‌ని. మ‌రోవైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండ‌టంతో.. నేత‌లంతా అధికారం ఉన్న వారివైపే చూస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్‌గా త‌న కుర్చీని స్ట్రాంగ్ చేసుకోవ‌డం కోసం పార్టీ మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా..ఇటు తన పదవిని కాపాడుకోవడానికి రెండు రకాలు సీనియర్లతో సూచనలతో వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. దాంతో మీనాక్షి పాదయాత్ర కాస్త పీసీసీ చీఫ్ పాదయాత్రగా మారిపోయింది. దీంతో ప్రతిపక్షాలు పెద్దగా ఈ ఎపిసోడ్‌పై రియాక్ట్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మీనాక్షి పాదయాత్ర పార్టీ కార్యక్రమంగా నడిచిపోతోంది. ఈ విడత పాదయాత్ర తర్వాత ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉంటాయో చూడాలి మరి.