Mekapati Chandra Sekhar Reddy : ఆనం బాటలో మేకపాటి.. టీడీపీలో చేరుతున్నానంటూ సంచలన ప్రకటన

వైసీపీ ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డి మాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని అందుకే ఆయన్ని ఆహ్వానించటానికి వచ్చానని తెలిపారు.

Mekapati Chandrasekhar Reddy

Mekapati Chandra Sekhar Reddy – Andhra Pradesh Politics : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వాడీ వేడీగా మారిపోతున్నాయి. పార్టీలు మారాలనే ఉద్ధేశం ఉన్న నేతలు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతున్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల నేతలు గళాలు విప్పుతున్నారు. ముఖ్యంగా వైసీపీ తిరుగుబాటు నేతలు టీడీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు.

లోకేశ్ పాదయాత్ర… నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల టీడీపీ బాట..
లోకేశ్ పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో నిరసన గళాలు విప్పి సొంతపార్టీ మీదనే విమర్శలు, ఆరోపణలు చేసిన నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణల బాటలోనే తాను కూడా అనేలా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. అంతేకాదు తన నియోజకవర్గం అయిన ఉదయగిరిలో యువగళం పాదయాత్ర ప్రవేశిస్తున్న క్రమంలో లోకేశ్ ను ఆహ్వానించటానికి కడప జిల్లా వచ్చానని తెలిపారు.

Nellore Politics : నెల్లూరు జిల్లాలో మారిపోతున్న రాజకీయాలు, కోటంరెడ్డితో మాజీ మంత్రి భేటీ.. టీడీపీలోకి ఆనం ఎంట్రీ

లోకేశ్ ను ఆహ్వానించటానికి వచ్చా.. పాదయాత్రను విజయవంతం చేస్తాం : మేకపాటి
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తానని తెలిపారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్ ను కలిసి తాజా రాజకీయ పరిణామాల పై సుదీర్ఘంగా చర్చించామని.. తనతో పాటు నెల్లూరు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని టికెట్ కోసం ఐదుసార్లు కలిశాను.. కానీ లాభం లేదు. ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక లాభం లేదనుకొని బయటికి వచ్చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తే.. పోటీ చేస్తానని.. ఒకవేళ టికెట్ ఇవ్వక పోయినా పార్టీ కోసం పని చేస్తానని వెల్లడించారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి లోకేష్ పాదయాత్రను ఆహ్వానిస్తామని తెలిపారు.

టీడీపీ బాట పడుతున్న నెల్లూరు రెడ్లు..
నెల్లూరు వైసీపీలో ముసలం రాజుకున్నట్లుగా నెల్లూరు పెద్దారెడ్లు నిరసన బావుటా ఎగురవేశారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటివారు టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికీ ఆనం చంద్రబాబుని కలవటం ఆయన ఓకే చెప్పటంతో ఆయన చేరిక ఖరారు అయ్యింది. ఇక మేకపాటి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక పోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరిక కూడా దాదాపు ఖరారు అయ్యింది. సొంతపార్టీపై విమర్శలు చేసిన సందర్భంలోనే కోటంరెడ్డి చంద్రబాబు అంగీకరిస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఇలా నెల్లూరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు.

కాగా.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఉదయగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసింగ్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు