Nellore Politics : నెల్లూరు జిల్లాలో మారిపోతున్న రాజకీయాలు, కోటంరెడ్డితో మాజీ మంత్రి భేటీ.. టీడీపీలోకి ఆనం ఎంట్రీ

Nellore Politics : నెల్లూరు జిల్లాలో మారిపోతున్న రాజకీయాలు, కోటంరెడ్డితో మాజీ మంత్రి భేటీ.. టీడీపీలోకి ఆనం ఎంట్రీ

kotamreddy sridhar reddy anam ramanarayana reddy

Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమంలో నెల్లూరు జిల్లా (Nellore District) వైసీపీలో గత కొంతకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నేతలు భేటీలు ఆసక్తికరంగా మారాయి. ఓ పక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)తో అమర్నాథ్ రెడ్డి, మరోపక్క ఆనంతో సోమిరెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే ఆనం టీడీపీ చేరిక ఖరారు అయ్యింది. దాదాపు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy).

కోటంరెడ్డితో టీడీపీ నేతలు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన కోటంరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది వైసీపీ. ఇక ఆయన ఏ పార్టీలో చేరతారనే చర్చ కొనసాగుతున్న క్రమంలో కోటంరెడ్డి బ్రదర్స్ తో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి భేటీ అయ్యారు. టీడీపీలోకి రావాలంటు ఆహ్వానించటానికి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సొంతపార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన కోటంరెడ్డి టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అది తుది దశకు చేరటానికి ఈ చర్చలు ఫలితాస్తాయనిపిస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంట్లో భాగంగానే కోటంరెడ్డి బ్రదర్స్ తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కోటంరెడ్డి నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆయనతో మంతనాలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా కోటంరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అంగీకరిస్తే 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తా అంటూ కోటంరెడ్డి గతంలో బహిరంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డితో భేటీ కావటంతో ఇక ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వటం ఖరారు అయినట్లుగా తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలోకి లోకేశ్ పాద్రయాత్ర ఎంట్రీ.. ఆసక్తికరంగా నెల్లూరు రెడ్ల భేటీలు 
కాగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం కడప జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్ర జూన్ 13కి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని టీడీపీలోకి చేర్చుకునే యత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే వైసీపీ నుంచి బహిష్కరించబడిన కోటంరెడ్డిని టీడీపీలో చేర్చుకోవటానికి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

టీడీపీలో చేరుతున్నా.. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తాం : ఆనం 
అలాగే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా వైసీపీ ప్రభుత్వ వైఖరిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆనం కూడా టీడీపీ పార్టీలోకి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంట్లో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసారు. చంద్రబాబుని కలిసిన సందర్భంగా ఆనం మాట్లాడుతు.. టీడీపీ అధినేత చంద్రబాబుని నిన్న కలిశానని.. వారితో కలిసి పనిచేస్తామని చెప్పామని వెల్లడించారు. దానికి చంద్రబాబు కూడా స్వాగతించారని.. తనను సాదరంగా ఆహ్వానించారని తెలిపారు. పాదయాత్ర ముగిసిన తరువాత తాను, తనతో ఉన్న వాళ్ళు అందరం టీడీపీలో చేరతామని.. పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీలో అధికారికంగా చేరుతామని స్పష్టంచే శారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం కోసం అందరం కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

రాయలసీమలో లోకేశ్ పాద్రయాత్ర సక్సెస్.. నెల్లూరులో అంతకంటే ఎక్కువ సక్సెస్ చేస్తాం : సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి
ఆనం టీడీపీలో చేరికపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగబోతుందని.. రాయలసీమకంటే బాగా జరిగేలా ఎఫర్ట్ పెడతామని తెలిపారు. ఈ పాదయాత్ర బాగా జరిగేలా ఆనం రామనారాయణరెడ్డి సలహాలూ తీసుకున్నామని.. యువగళం పాదయాత్ర విజయవంతానికి ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు కృషి చేస్తారని తెలిపారు. కొంత మంది ఎలా తిరుగుతారో చూస్తామన్నారు.. కానీ ఇవ్వాళ అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారని అన్నారు.

లోకేశ్ పాదయాత్ర విజయంగా కొనసాగుతోంది అని మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి తెలిపారు. రాయలసీమలో బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తామని అన్నారు.