Nitin Gadkari : ఏపీలో భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. షెడ్యూల్ ఇదే..!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించనున్నారు.

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం (ఫిబ్రవరి 17)న ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేసేందుకు నితిన్‌గడ్కరీ ఏపీకి రానున్నారు. సీఎం జగన్‌తో కలిసి కేంద్రమంత్రి గడ్కరీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు ఆయన బయల్దేరనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45 గంటలకు నితిన్ గడ్కరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఫొటో ఎగ్జిబిషన్‌ గడ్కరీ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఇందిరిగాంధీ స్టేడియంలో ఎన్‌హెచ్ ప్రాజెక్టుల (జాతీయ రహదారి ప్రాజెక్టులు)ను జాతికి అంకితం చేయనున్నారు. అందులో 1.45 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు.

ఇందులో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చెందినవి 13 వేల 806 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందినవి 7 వేల 753 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి సీఎం నివాసానికి పయనం కానున్నారు.మధ్యాహ్నం 2.20 గంటల నుంచి 3.30 గంటల వరకు తాడేపల్లిలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై గడ్కరీ సమీక్ష జరపనున్నారు. అనంతరం సీఎం నివాసంలో గడ్కరీ విందు చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని గడ్కరీ సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5.15 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గడ్కరీని పార్టీ కార్యవర్గం ఘనంగా సత్కరించనుంది. సాయంత్రం 5.20 నుంచి 5.45 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి నాగపూర్ కు గడ్కరీ బయల్దేరి వెళ్లనున్నారు.

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిలో పశ్చిమగోదావరి జిల్లాలో రేచర్ల-గురవాయిగూడెం-దేవరపల్లి మధ్య రెండు ప్యాకేజీల్లో 56.89 కిలో మీటర్లు, 12 వందల 81 కోట్లతో 4 వరుసల రహదారి నిర్మాణానికి గడ్కరీ భూమిపూజ చేయనున్నారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నిర్మించిన ఏపీ, తమిళనాడులో చిత్తూరు-తట్చూరు హైవే కింద 3 ప్యాకేజీల్లో 96.04 కిలో మీటర్లు, 3 వేల 178 కోట్ల రూపాయలతో 6 వరుసల రహదారి నిర్మాణానికి పునాదిరాయి వేయనున్నారు. రాజమహేంద్రవరం-విజయనగరం జాతీయ రహదారిలో 3 ప్యాకేజీలు కలిపి వెయ్యి 21 కోట్ల రూపాయలతో 2 వరుసలుగా విస్తరణ చేపట్టనున్నారు. బెంజిసర్కిల్‌ రెండో వంతెన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి గడ్కరీ రావాల్సి ఉండగా.. గతంలో రెండుసార్లు ఆయన పర్యటన వాయిదా పడింది. ఏపీలో ఇతర ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలు అన్నింటినీ ఒకేచోట నుంచి నిర్వహిస్తున్నారు.

Read Also : Cost of Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ!

ట్రెండింగ్ వార్తలు