Polavaram : పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం పనులు ఊపందుకున్నాయని వెల్లడించారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులు అందించామని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును తిరిగి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తానని సీఆర్ పాటిల్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఢిల్లీ పర్యటనలో సీఆర్ పాటిల్ ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు.
జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా కేంద్రం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఆర్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతం అయ్యాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే ప్రాజెక్ట్ ను కూడా సందర్శించబోతున్నట్లు సీఆర్ పాటిల్ తెలిపారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలను వేగవంతం చేయడంతో పాటుగా నదుల అనుసంధానికి సంబంధించి జలజీవన్ మిషన్ కు సంబంధించిన విషయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గృహ ప్రవేశం కార్యక్రమంలో తెలుగు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం నిర్మాణం సమయం మరో రెండేళ్ల పాటు పొడిగించడం జరుగుతుందన్నారు. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ అని, కేంద్రమే పూర్తి స్థాయి నిధులను ఇవ్వడం జరుగుతుందని, ప్రాజెక్ట్ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులను ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయడం జరుగుతోందన్నారు. డయాఫ్రమ్ వాల్, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని రీ కన్ స్ట్రక్ట్ చేయాల్సి ఉందన్నారు. వీలైనంత తొందరగా ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేస్తామన్నారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు త్వరలోనే పోలవరం సందర్శిస్తానని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు.
Also Read : 6 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది- జగన్ సంచలన వ్యాఖ్యలు..