Ys Jagan Mohan Reddy : 6 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది- జగన్ సంచలన వ్యాఖ్యలు..

మన పాలనలో కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బులైనా వచ్చేవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా ఆదాయం రాకపోగా..

Ys Jagan Mohan Reddy : 6 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది- జగన్ సంచలన వ్యాఖ్యలు..

Updated On : December 5, 2024 / 6:50 PM IST

Ys Jagan Mohan Reddy : ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు జగన్. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఇందులో కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు.

6 నెలల్లోనే ఒక ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం గతంలో ఎప్పుడూ లేదన్నారు జగన్. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారి పోతున్నాయని జగన్ ధ్వజమెత్తారు. వైద్య రంగం పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన వాపోయారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సూపర్ సిక్స్ అమలు చేయడం లేదని, హామీల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబ మోసం చేశారని జగన్ మండిపడ్డారు.

”కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలై పోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొంత ఉంటుంది. కానీ, ఫస్ట్ టైమ్ ఇలాంటి ప్రభుత్వం చూస్తున్నాం. 6 నెలలు గడవకముందే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయో అని హలో హలో అని ఫోన్ చేసి అడుగుతారట. అసలు పథకాలు ఉంటే కదా.. నువ్వు అడగటానికి, అవతలి వ్యక్తి చెప్పడానికి. అసలు స్కీమ్ లే లేవు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపు ఉంటే, మరోవైపు విచ్చలవిడిగా అవినీతి. మనకన్నా తక్కువ రేటుకు ఇసుక ఇస్తామని మోసం చేశారు. మన పాలనలో కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బులైనా వచ్చేవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా ఆదాయం రాకపోగా..ఇసుక రేట్లు చూస్తే డబుల్ చేశారు” అని జగన్ మండిపడ్డారు.

”తూచ తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిన ప్రభుత్వం మాది అని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉందని అంటే.. అది ఒక వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే అని నేనే గర్వంగా చెప్పగలను. అతి మంచితనం, అతి నిజాయితీతనం.. ఈ రెండూ నీతో ఉన్న సమస్యలు అని మన పార్టీ నేతలు నాతో చెప్పారు. అది వాస్తవమే. అతి నిజాయితీతనం, అతి మంచితనం.. బహుశా నాకున్న ప్రాబ్లమ్స్ కావొచ్చు. కానీ, రేపు పొద్దున అవే కారణాల వల్లే మళ్లీ మనం అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం” అని జగన్ అన్నారు.

‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. నియోజకవర్గాల్లో ప్రతి దానికి ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇవ్వాల్సిన దుస్థితి. మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటిస్తా. ప్రతి బుధవారం, గురువారం కార్యకర్తలతో మమేకం అవుతాను. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి’ అని పార్టీ కార్యకర్తలతో చెప్పారు జగన్.

Also Read : అరెస్ట్ ఖాయమా? సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ అక్రమాల చిట్టాపై చంద్రబాబు సర్కార్ ఫోకస్..