Bhupathiraju Srinivasa Varma : కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శ్రీనివాస వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్లమెంట్ నుంచి మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ వాహనం శ్రీనివాస వర్మ కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ లో శ్రీనివాస వర్మ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది.
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. పార్లమెంట్ నుంచి ఆయన తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పార్లమెంట్ ప్రాంగణం నుంచి ఆయన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఒక కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఆలోపే ఈ ప్రమాదం జరిగింది.
Also Read : ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
వెంటనే వర్మను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. వర్మకు కాలికి, తలకు బలమైన గాయాలయ్యాయి. శ్రీనివాస వర్మ నర్సాపూర్ లో రేపు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం గాయాలతోనే ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అసలేం జరిగింది? తప్పిదం ఎవరిది? ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కారులో వెనకవైపున శ్రీనివాస వర్మ కూర్చుని ఉన్నారు. కేంద్రమంత్రి కావడంతో ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Also Read : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అయితే, ఒక భారీ ప్రమాదం అయితే తప్పిందంటున్నారు పోలీసులు. ప్రాథమిక చికిత్స అనంతరం తాను బాగానే ఉన్నానంటూ శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరారు. ప్రమాదానికి గురైన కారుని ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తొలగించారు. పార్లమెంట్ కు హోలీ సెలవులు ప్రకటించారు. మళ్లీ సోమవారం నుంచి సమావేశాలు ఉంటాయి. సెలవులు కావడంతో ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్తున్నారు.