kappatralla forest
Kappatralla Forest : కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ప్రచారంతో అలజడి మొదలైంది. కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. యురేనియం నాణ్యత అధ్యయనానికి రంగం సిద్ధం చేశారు. యురేనియం నిక్షేపాల పరిమాణం తెలుసుకోవడానికి ‘అటామిక్ మినరల్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండి) అధికారులు సన్నాహాలు
చేస్తున్నారు. ఏడాది కిందటనే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు.
Also Read: Harsha Sai : హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి.. ముందస్తు బెయిల్ కోసం..
కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం 468 హెక్టార్లలో విస్తరించి ఉంది. నాలుగేళ్ల క్రితమే యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 70చోట్ల బోర్ డ్రిల్లింగ్ కు మొదట నిర్ణయించారు. కౌలుట్టయ్య స్వామి ఆలయం ఉండటంతో రెండు చోట్ల బోర్లు డ్రిల్లింగ్ చేయడానికి అటవీశాఖ అనుమతులు నిరాకరించింది. దీంతో 68 చోట్లనే బోర్ డ్రిల్లింగ్ చేయాలని ఏఎండీ అధికారులు నిర్ణయించారు. యురేనియం గుర్తించిన చుట్టుపక్కల కప్పట్రాళ్ల, జిల్లేడుగుడకల, పి. కొటకొండ, మాదాపురం, చెల్లెలచెలిమి, గుండ్లకొండ గ్రామాలున్నాయి. ఆరు గ్రామాల పరిధిలో సుమారు 20వేల మంది జీవనం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని సుమారు 30వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి.
యురేనియం తవ్వకాల నిర్ణయంపై గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. యురేనియం తవ్వకాలను అడ్డుకొని తీరుతామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించిన సీపీఎం నేతలు.. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని వెల్లడించారు.