వరదల్లో దసరా.. నింగికెగిసిన సరదా

విజయానికి సూచికగా జరుపుకునే Vijayadashami కొత్త ఉత్సాహంతో మొదలుపెడతారు. కొత్తబట్టలు, కొత్త వాహనాలతో పండుగకు బోలెడంత జోష్ నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవేమీ ఈ ఏడాది కనిపించేట్లుగా లేదు పరిస్థితి. అటు కరోనా, ఇటు ప్రకృతి ప్రకోపం ప్రజలకు క్లిష్టంగా మార్చేశాయి. భక్తుల దసరా ఉత్సవాలపై నీళ్లు జల్లాయి.

పండుగ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న వ్యాపారులను నీరు గార్చాయి. ఈ సందర్బంగానైనా కొద్దో గొప్పో వ్యాపారం జరిగి, కాస్త తెప్పరిల్లుదామనుకున్న చిన్న, పెద్ద వ్యాపార వర్గాల ఆశలు అడియాసలు అయ్యాయి.



దసరా నవరాత్రులతో పాటు మరో సంబురం బతుకమ్మ. శీతాకాలపు తొలి రోజుల ప్రకృతి సౌందర్యంలో పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేస్తుంటారు. తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేకంగా జరుపుకునే పూల సంబురం. గునుగు, తంగేడు పూలు, బంతి, చామంతి, నంది వర్ధనం లాంటి రంగు రంగుల పూలను తీర్చి..బతుకమ్మా అంటూ కొలిచే అపురూపమైన సందర్భం.
https://10tv.in/bathukamma-celebration-in-telangana/
2020 దసరా మాత్రం దేశవ్యాప్తంగా ప్రదానంగా తెలంగాణా ప్రజలకు చేదు జ్ఞాపకాన్ని మాత్రమే మిగులుస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఎదురుచూసే సంబురం బతుకమ్మ. ఈ శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆటపాటల ఉత్సాహం, కోలాహల వాతావరణం కన్నులపండువగా ఉంటుంది.

ఏడాదికి సరిపడా స్ఫూర్తిని పొందడానికి ఉత్సాహంతో జరుపుకుంటారు. కానీ, అదంతా ఎక్కడా కనిపించడం లేదు. ఎవరికి వారే చాలా పరిమితంగా బతుకమ్మలాడుతూ మళ్లీ ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మకు మొక్కి వేడుకుంటున్నారు.

ఆవిరైపోయిన దసరా జోష్:
7 నెలలుగా స్థబ్దుగా ఉండి, లాక్‌డౌన్ అంక్షల సడలింపు తర్వాత పెద్దగా డిమాండ్ లేక వెలవెల బోయిన వ్యాపార సంస్థలు పండుగ సీజన్ బిజినెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. భారీ డిస్కౌంట్లు, తగ్గింపు ఆఫర్లు, ఉచిత ఆఫర్లు అంటూ ఇలా రకరకాల పేర్లతో కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలూ సిద్ధమైయ్యాయి. ఈ మేరకు కొద్దిగా మార్కెట్‌లో సందడి నెలకొంది.



నూతన వస్త్రాల కొనుగోళ్లు, ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, వాహనాలు, ఇతర వస్తువుల కొనుగోళ్ల ఊపందుకున్నాయి. ఇంతలోనే భారీ వర్షాలు పరిస్థితిని అతాలకుతలం చేసేశాయి. పల్లెలతో పాటు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ మొత్తం వరద ధాటికి మునిగిపోయింది. మొదట్లో నెలకొన్న దసరా జోష్ కనుమరుగుకావడంతో వ్యాపారులు డీలాపడిపోయారు.

పూల పండుగకు మార్కెట్లు వెలవెల:
దసరా, బతుకమ్మ పండుగ అంటూనే పూలపండుగ. బంతి, చేమంతి, లాంటి వాటితోపాటు, గునుగు, తంగేడు, నంది వర్ధనం, గుమ్మడి పూలు లాంటి వాటికి ఫుల్ డిమాండ్. కానీ పూలు, పూల దండలు, నిమ్మకాయలు, రకరకాల బొమ్మలను విక్రయించే విక్రయదారులు గిరాకీ లేక నీరుగారి పోతున్నారు. దశమి రోజుకు డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి.

ముంచెత్తిన వానలు, కట్టలు తెగిన చెరువులు, పొంగిన నాలాలు దసరా పండుగ అనే మాటనే మర్చిపోయేలా చేశాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, బతుకుజీవుడా అంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. ఎప్పుడు ఏవైపు నుంచి మబ్బులు కమ్మేస్తాయో తెలియక అయోమయంలో ఉంటున్నారు.