ఇదే ఆఖరి సెల్ఫీ అంటూ టిక్‌‌టాక్‌లో పెట్టాడు.. అదే నిజమైంది

  • Publish Date - January 2, 2020 / 04:04 AM IST

ఒరేయ్‌ బావా.. చూడు, ఇదే నా చివరి సెల్ఫీ అన్నాడు.. ఈ ఏడాదికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరది అన్నాడు. అతను చెప్పింది సరదాగా అయినా నిజంగా అదే జరిగింది. అనంతలోకాలకు వెళ్లిపోయాడు. సరదాగా చిత్రీకరించుకున్న టిక్‌టాక్‌ వీడియోలోని మాటలు నిజమవగా.. అతని కుటుంబం మాత్రం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎం.కొత్తవలసకు చెందిన ఎం.వినోద్‌ గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం(31 డిసెంబర్ 2019) రాత్రి వరకు ఆనందంగా గడిపాడు. ఈ సంవత్సరానికి ఇదే చివరి సెల్ఫీ అంటూ వీడియో తీసుకుని టిక్‌టాక్‌లో పెట్టాడు.

ఈ వీడియో తీసిన కొద్దిసేపటికే మరో ఇద్దరితో కలిసి ముగ్గురూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బొండపల్లి మండలం యడ్లపాలెం సమీపంలో అర్ధరాత్రి దాటాక తాటి చెట్టును ఢీకొట్టడంతో వినోద్‌ పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయాడు. మిగిలిన ఇద్దరు గాయపడ్డారు.