Vijayawada Durga Gudi : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలు, సమస్యలు తలెత్తకుండా కరోనా దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలతో.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది.
అశేష భక్తకోటితో అనునిత్యం నిత్యపూజలందుకుంటూ విశేషంగా కొలవబడుతున్న బెజవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాల్లో దర్శనమివ్వనుండగా.. అమ్మవారికి సకల లాంఛనాలు సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీ అయ్యారు.
అమ్మవారి దర్శనార్ధం తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత సంవత్సరం దాదాపు 15 లక్షలకు పైగా భక్తులు అమ్మవారి ఉత్సవాలకు విచ్చేయగా.. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా రోజుకు కేవలం పది వేల మందిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
కెనాల్ రోడ్డులోని వినాయక గుడి నుంచి ఘాట్ రోడ్ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు నాలుగు లైన్ల క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన దగ్గరి నుంచి అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి మహామండపం నుంచి కిందికి వచ్చే వరకు పటిష్టమైన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కోవిడ్ దృష్ట్యా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ప్రతి ఒక్క భక్తుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను విధించారు.
ప్రతి భక్తుడికి మూడు అడుగుల మేర డిస్టెన్స్ ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దసరా ఉత్సవాల్లో కీలకమైన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.
మరోవైపు వీఐపీ భక్తులకు, వికలాంగులకు, వృద్ధులకు నేరుగా ఇంద్రకీలాద్రి పైకి వెళ్లేందుకు వాహన సౌలభ్యాన్ని కల్పించాలనే అలోచనలో ఉన్నారు దుర్గగుడి అధికారులు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన అధికారులు.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, వైద్యం, వసతి సౌకర్యాలను అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు. అలాగే అమ్మవారి లడ్డూ ప్రసాదాలు ఉత్సవాల నాటికి పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచనున్నారు. మహామండపాన్ని మాత్రం ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా వినియోగించుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికావచ్చాయి.
దసరా ఉత్సవాలకు సంబంధించిన వివిధ శాఖలు ఇప్పటికే ఉత్సవాలు జరిగే రోజున అధికారులకు డ్యూటీలు, భక్తుల పట్ల వ్యవహరించాల్సిన జాగ్రత్తలు, వారి భద్రత, రక్షణ చర్యలపై పూర్తిగా దృష్టి సారించారు. ముఖ్యంగా దసరా ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందబోస్తు చర్యలు చేపట్టింది. దుర్గమ్మ దర్శనానికీ కోవిడ్ ఆంక్షల అమలు కానున్నాయి. కోవిడ్ దృష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులను అనుమతిస్తున్న క్రమంలో.. స్లాట్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తామంటున్నారు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు.
మూలానక్షత్రం సరస్వతీ అలంకారం రోజున పదిహేను వేల మందికి మాత్రమే అనుమతిస్తామని.. ఉత్సవాల ఆఖరి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాలను మాత్రం అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్లను ఉరుకులు పెట్టిస్తున్నారు. ఉత్సవాలు ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.