Local Boy Nani
Local Boy Nani: ప్రముఖ తెలుగు యూట్యూబర్, మత్స్యకారుడు లోకల్ బాయ్ నానికి పోలీసులు బిగ్ షాకిచ్చారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను నాని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అతనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇలాంటి ప్రమోషన్లు చట్టవిరుద్ధమని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే.
Also Read: Local Boy Nani: లోకల్ బాయ్ నానికి సజ్జనార్ వార్నింగ్.. ఇవేం దిక్కుమాలిన పనులు?
సజ్జనార్ వీడియో వైరల్ కావడంతో లోకల్ బాయ్ నాని తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ యువతను చెడగొడుతున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోకల్ బాయ్ నాని స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు క్షమాపణలు చెప్పాడు. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను.. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని అన్నాడు. నేను చదువుకోలేదు అందుకోసమే ఇలా చేశాను. సజ్జనార్ సార్ కి సారీ చెబుతున్న.. ఇలాగే అందరికి బుద్ది వచ్చేలా చేయాలి అంటూ నాని చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా నానికి విశాఖ పోలీసులు షాకిచ్చారు.
Also Read: Local Boy Nani : తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని లోకల్ నాని ఆవేదన..
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నవాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్ లపై ప్రచారం చేయడంతోపాటు.. ఫేస్ బుక్, ఇన్ స్టాలో ఉంచారు. ఇలాంటి ప్రచారంతో యువత బెట్టింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని, వారిని తప్పుదోవ పట్టిస్తున్న నానిపై చర్యలు తీసుకోవాలని ఈనెల 21న కొంతమంది సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నానిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఇలా బెట్టింగ్ యాప్ లను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రచారం చేసినందుకు యాప్ నిర్వాహకులు కొంత డబ్బును అతనికి ముట్టచెప్పినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అతన్ని రిమాండ్ కు పంపించారు.