గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి సర్కారు కన్నేసింది. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేజిక్కించుకుంది. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం వంతు వచ్చింది. ఇన్నాళ్లు GVMCపై పెద్దగా ఫోకస్ పెట్టని కూటమి పెద్దలు..ఇప్పుడు విశాఖ మేయర్ మార్పునకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
మార్చి 18 నాటికిగ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే నగర ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివిధ అంశాలపై చర్చించారు.
లెక్కలు, సమీకరణాలపై దృష్టి పెట్టిన నేతలు.. వన్ ఫైన్ డే ప్లాన్‌ను అమలు చేసి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి GVMC బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఈ మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఇంకా జరపలేదు. దీంతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి, బడ్జెట్ ఆమోదించిన తర్వాత..మరో కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని కూటమి నేతలు పరిశీలిస్తున్నారట.
కూటమికి 56 మంది, వైసీపీకి 39 మంది
ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కౌన్సిల్‌లో 97 మంది కార్పొరేటర్లు ఉండగా, 64 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలాబలాలు చూస్తే కూటమికి 56 మంది, వైసీపీకి 39 మంది, సీపీఎంకు ఒకరు, సీపీఐకి ఒకరు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే.. మరో ఎనిమిది మంది కార్పొరేటర్ల మద్దతు ఎన్డీఏ పక్షాలకు అవసరం.
Also Read: ఏపీ పాలిటిక్స్‌ను ప్రభావితం చేస్తున్న వివేకా కేసు.. ఇప్పుడు కూడా..
కలెక్టర్‌కు ఇచ్చే నోటీసులో సంతకాలు పెట్టాల్సి ఉండటంతో, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు బయటపడతారా లేదా అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ మారొద్దని, భవిష్యత్ బాగుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మేయర్‌పై ఉన్న వ్యతిరేకతతో కార్పొరేటర్లు సంతకాలు చేసేందుకు ముందుకొస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు.
మేయర్ రేసులో వీళ్లు
GVMC టర్మ్ మరో ఏడాది మాత్రమే ఉన్నా, పదవుల కోసం కూటమి కార్పొరేటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు పోటీ పడుతుండగా, వారిలో ఒకరు మేయర్ స్థానంపై గురిపెట్టారు. నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కూటమిలో చేరిన ఓ మహిళా కార్పొరేటరు, మరో స్వతంత్ర కార్పొరేటర్ కూడా మేయర్ పీఠం ఆశిస్తున్నారు. పదవుల పందేరంపై టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యుల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అంతేకాదు వైసీపీని వీడి కూటమికి మద్దతు తెలపబోతున్న కార్పొరేటర్లకు కూడా లాభదాయక పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది.
విశాఖ మేయర్ పీఠం టార్గెట్‌గా కూటమి పార్టీలు మరో పది రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. మార్చి 18 తర్వాత ఏ క్షణమైన ఫ్యాన్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తప్పదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశం అవుతుందా లేక వైసీపీ పట్టు నిలుపుకోగలుగుతుందా అనేది చూడాలి మరి.