ఏపీ పాలిటిక్స్‌ను ప్రభావితం చేస్తున్న వివేకా కేసు.. ఇప్పుడు కూడా..
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం.

సరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నిలకు ముందు మాజీ మంత్రి వివేకా హత్య జరిగింది. మొదట గుండెపోటుగా ప్రచారం జరగ్గా..ఆ తర్వాత మర్డర్‌గా నిర్ధారించడంతో కేసును..ఏపీ పోలీసులు విచారించారు. సిట్ నుంచి సీబీఐ వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో వివేకా హత్య కేసు ఏపీ పాలిటిక్స్‌లో గేమ్‌ఛేంజర్ అయింది. అప్పుడు టీడీపీ ఓటమికి ఈ కేసు ఓ కారణమైందన్న చర్చ ఉంది.
ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక 2019లో వైసీపీ పవర్‌లోకి వచ్చిన తర్వాత కూడా గత ఐదేళ్లు వివేకా హత్య కేసు చుట్టే ఏపీ పాలిటిక్స్ కొనసాగాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కూడా వివేకా హత్య కేసు ఓ కారణమైందని పలువురు నేతలు చెబుతుంటారు. వివేకా కూతురు సునీతా, వైఎస్ జగన్ సోదరి షర్మిల..జగన్, అవినాశ్‌రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ ప్రచారం చేశారు. ఏకంగా అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీగా కంటెస్ట్ చేశారు సునీతా.
ఇలా గత ఆరేళ్లుగా వివేకా హత్య కేసు ఏపీ పాలిటిక్స్‌లో లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది. వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాశ్ టార్గెట్‌గా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఓ వైపు రాజకీయ విమర్శలు కొనసాగుతుండగానే..మరోవైపు వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తూనే ఉంది. సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డితో పాటు అతని తండ్రి ఇతరులను విచారించింది సీబీఐ.
ఓ రేంజ్‌లో హడావుడి
అంతేకాదు అవినాశ్‌రెడ్డి అరెస్ట్ కూడా ఉంటుందని అప్పట్లో ఓ రేంజ్‌లో హడావుడి నడిచింది. ఏమైందో ఏమో కానీ వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఫేస్ చేస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌కు మాత్రం బ్రేకులు పడ్డాయి. అయినా ఇప్పటికీ డైలీ ఎపిసోడ్‌గానే కొనసాగుతోంది వివేకా హత్య కేసు.
ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది వివేకా హత్య కేసు. ఈసారి ఏకంగా ఏపీ క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించడం హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే..కీలక సాక్షులు ఒక్కొక్కరుగా మరణిస్తుండటంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. డీజీపీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సాక్షుల వరుస మరణాల వెనుక నిందితుల ప్రమేయం ఉందా.? అని అనుమానం వ్యక్తం చేశారట. ఈ ఇష్యూపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. చనిపోయిన ఆరుగురు సాక్షులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా..వారంతా హెల్త్ ప్రాబ్లమ్స్‌తోనే చనిపోయారని చెబుతున్నారని..అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి పెద్దలు.
వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్‌మెన్ రంగన్నది కూడా అనుమానాస్పద మరణమేనని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీశ్‌గుప్తాను పిలిచి మరీ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వివేకా హత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు సీఎం చంద్రబాబు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ రోజు ప్రసారం చేయడాన్ని చూసి..తాను కూడా అదే జరిగిందని అనుకున్నానని చెప్పారు.
క్యాబినెట్ కీలక నిర్ణయం
సాక్షులంతా అనుమానాస్పదంగా మరణించడాన్ని తీవ్రంగా పరిగణించాలని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నట్టు సమాచారం. ఆరుగురు సాక్షులు మరణించడానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై ఇన్ డిటేయిల్డ్ రిపోర్ట్ రెడీ చేయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సిట్ దర్యాప్తును వేగంగా పూర్తి చేయించి.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులైన కే.శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేశ్‌రెడ్డి, వాచ్‌మెన్ రంగన్నలు మృతి చెందారు. వారికి ఈ కేసుకు ఉన్న లింకుపై డీజీపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించినట్టు తెలిసింది. ఇలా చాలా క్లిష్టంగా మారిన ఈ కేసు..అటు దర్యాప్తు సంస్థకు..ఇటు ఏపీ పాలిటిక్స్‌కు సవాల్‌గా మారింది. ఆరేళ్లుగా రోజుకో ట్విస్ట్‌తో హాట్‌టాపిక్‌గా కొనసాగుతోన్న వివేకా హత్య కేసు దర్యాప్తు ఎప్పుడు పూర్తి అవుతుందో క్లారిటీ లేదు.
అప్పటిలోపే సాక్షులు వరుసగా చనిపోతుండటంపై కూటమి సర్కార్ ఆరా తీస్తోంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా మరణిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందంటోంది కూటమి ప్రభుత్వం. అందుకే సీఎం చంద్రబాబు వివేకా హత్య కేసు సాక్షుల మరణాలపై ప్రత్యేకంగా ఆరా తీసినట్లు తెలిసింది. ఇప్పటికే ఆరేళ్లుగా..రెండు ఎలక్షన్స్ రిజల్స్ట్‌ను ప్రభావితం చేసిన వివేకా హత్య కేసు.. రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.