నక్సలైట్ కావాలని అనుకున్నా విశాఖ రేంజ్ డీఐజీ

  • Publish Date - December 13, 2020 / 10:59 AM IST

Visakha Range DIG LKV Ranga Rao : తాను నక్సలైట్ కావాలని అనుకున్నానని, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడమే నక్సలిజమే కరెక్టు అని భావించానని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలానికి వచ్చిన ఆయన..2020, డిసెంబర్ 12వ తేదీ శనివారం మంగళపాలెంలో శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ…భారతదేశంలో కులం, డబ్బు, అవినీతి వంటి దుర్మార్గాలు రాజ్యమేలుతున్నాయని, అవినీతే దేశానికి పట్టిన దర్రిద్రం అన్నారు. కృష్ణా జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన వాడినని, ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ వైద్యుడిని కలిసి..తనను నక్సలైట్లలో చేరిపించాలని కోరినట్లు వెల్లడించారాయన.

కానీ..ఆ వైద్యుడి సూచనల మేరకు ఆ నిర్ణయం తప్పని తెలుసుకున్నట్లు తెలిపారు. తన తండ్ర ఆశయం మేరకు సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని, 1993 బ్యాచ్‌కు ఎంపికయినట్లు చెప్పారు. ఏ శాఖ ఎలా ఉన్నా..సరే..పోలీసు వ్యవస్థ మాత్రం నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువుట్టద్దంలా ఉండాలని లక్ష్యంతో తాను పనిచేయడం జరుగుతోందన్నారు. ఆచరణలో మరొకటి చేయడం సమాజంలో సర్వసాధారణంగా మారిపోయిందని, అవినీతి రహిత సమాజం కోసం డా.బి.ఆర్. అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారని స్పష్టం చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతొక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు.