విశాఖ నగరానికి ముంచుకొస్తున్న ముప్పు..! బెంగళూరు సంస్థ అధ్యయనంలో షాకింగ్ అంశాలు

గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

Visakhapatnam In Danger Zone : జువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ కాలక్రమంలో తీరం వెంబడి కొంత భూభూగాన్ని తనలో కలిపేసుకుంటుందా? ఇదే అంశం ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశంలోని తీర నగరాలకు ముప్పుగా పరిమణించనుందా? ఆ జాబితాలో విశాఖ నగరం కూడా ఉందా? అంటే అవుననే అంటోంది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ(CSTEP). 2040 కల్లా తీర ప్రాంతంలో 1.02 శాతం నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

భూ తాపం ప్రభావంతో ప్రపచంవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 2040 నాటికి కల్లా విశాఖ తీరంలో 1.02 శాతం భూభాగం నీట మునిగే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన సంస్థ తాజా అధ్యయనం వెల్లడించింది. 1992 నుంచి 2021 వరకు ఏడాదికి 0.18 సెంటీమీటర్ల వంతున మొత్తం 2.38 సెంటీమీటర్ల మేర సముద్రమట్టం పెరగడంతో తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. ఇదే విధంగా 2040 నాటికి సముద్రమట్టం 16.7 నుంచి 18.3 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని, తీరంలో సుమారు 1.02 శాతం ప్రాంతం ముంపునకు గురవుతుందని సంస్థ తెలిపింది.

సముద్ర మట్టాలు పెరుగుదల తీర ప్రాంతాలకు మప్పు అనే అంశంపై బెంగళూరుకు చెందిన సంస్థ (సీఎస్ టీఈపీ) అధ్యయనం చేసింది. దేశంలో ముంబై తర్వాత ఎక్కువగా హల్దియా, విశాఖ నగరాలే సముద్ర ముంపునకు గురవుతాయని అధ్యయనంలో హెచ్చరించింది. విశాఖలో పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై ఈ బృందం అధ్యయనం చేసింది. 2040 కల్లా తీర ప్రాంతంలో 6.96 చదరపు కిలోమీటర్ల నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వ్యవసాయ భూములు, పచ్చిక బయళ్లు, పారిశ్రామిక ప్రాంతంతో పాటు నీటి వనరుల ప్రాంతాలు నీట మునగనున్నాయి. దీంతో విశాఖ పోర్టు, తెన్నేటి పార్క్, రుషికొండ, మంగమారిపేటలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని ఈ సంస్థ అంచనా వేసింది.

పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతం ఇప్పటికే చాలావరకు కోతకు గురై నీట మునిగింది. ఏటా విశాఖ తీరంలో సముద్రం ముందుకు వస్తోంది. కోస్టల్ బ్యాటరీ, సబ్ మెరైన్, వైఎంసీఏ ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతోంది. ఆర్కే బీచ్ లో స్టాండింగ్ పాయింట్ కు ఒకప్పుడు సముద్రం చాలా దూరం ఉండేదని, ఇప్పుడు రుతుపవన సీజన్ లో నీరు తాకుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మానవ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావంతో పెరిగిన భూతాపం వల్ల సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకు ఆసియా దేశాలు మినహాయింపు కాదని ఐపీసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. సముద్ర మట్టాలు పెరగడంతో ముంబై తర్వాత ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే నగరం విశాఖనే అని తాజా అధ్యయనం తెలుపుతోంది. సముద్ర మట్టాలు పెరిగితే ఎయిర్ పోర్టు పక్కన ఉన్న మెహాద్రిగడ్డలోకి నీరు ప్రవేశిస్తే ఆ ప్రాంతంలో చెట్లు, మర అడవులు ముంపునకు గురవుతాయి. భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారతాయి. బీచ్ రోడ్ ఇప్పటికే కోతకు గురవుతూనే ఉంది. సముద్ర మట్టాలు పెరిగే క్రమంలో బీచ్ రోడ్ ప్రమాదంలో పడనుంది. ఇప్పటికే సముద్రపు కోతల కారణంగా బీచ్ అస్తవ్యస్తమైంది. కాగా చెట్లను పెంచడం ద్వారా నష్టాన్ని కొంత మేర తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఉమ్మడి విశాఖ పరిధిలో 131 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వాటిలో 15 గ్రామాల వద్ద తీరం తరుచూ కోతకు గురవుతోంది. 2014 హుదూద్ తుపాను సమయంలో ఆర్కే బీచ్ పరిధిలో కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. వాతావరణం వేడెక్కుతుండటంతో మంచుకొండలు కరగటమే సముద్ర మట్టాలు పెరగడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. విశాఖ తీరంలో కొండలు సముద్రంలోకి చొచ్చుకుని ఉండటమూ కోతకు కారణం అవుతోందని అంటున్నారు. యారాడ కొండ కారణంగా ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో యారాడ కొండకు మరోవైపు ఉన్న ఆర్కే బీచ్, సబ్ మెరైన్ బీచ్ మ్యూజియం వద్ద కోత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక విశాఖ మాత్రమే కాదని కాకినాడ, మచిలీపట్నం, యానం వంటి తీరాలకు సైతం ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అయితే, భవిష్యత్తులో మార్పులు వచ్చి గ్లోబల్ వార్మింగ్ తగ్గితే సముద్రపు కోత తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. లేదంటే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read : ఉమ్మడి విశాఖ జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్.. కూటమి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

ట్రెండింగ్ వార్తలు