visakhapatnam ysrcp: విశాఖ జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తహతహలాడుతున్న వైసీపీ.. తన ఎత్తుగడలను వేగవంతం చేసింది. 2019 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ పాగా వేసినా సిటీ పరిధిలోని నాలుగు స్థానాలను కోల్పోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుతున్న విశాఖలో ప్రతిపక్షం జెండా ఎగిరితే ప్రభుత్వానికి అవమానంగా భావిస్తోంది. అందుకే జీవీఎంసీపై వైసీపీ జెండా ఎగరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అధికార పార్టీ చూపు టీడీపీ ఎమ్మెల్యేలపై పడింది. పార్టీతో అంటీ ముట్టనట్లు గా ఉన్న నేతలపై గురిపెట్టింది.
ఎమ్మెల్యేల వారసులకు వైసీపీలోకి ఆహ్వానం:
ఇతర పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను నేరుగా తీసుకోరాదనేది పార్టీ నిబంధన. దీనిని గౌరవిస్తూనే స్వామి కార్యం… స్వకార్యం పూర్తి చేసేయాలని అడుగులు వేస్తోంది వైసీపీ. ఎమ్మెల్యేల వారసులను పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పేయాలనే నిర్ణయానికి వచ్చిందట. ఇందులో భాగంగానే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తన ఇద్దరు కుమారులతో కలిసి ముఖ్యమంత్రిని కలవడం, తన కుమారులకు వైసీపీ కండువా కప్పించేయడం పూర్తయ్యింది.
గణబాబు, వాసుపల్లికి ప్రజల్లో మంచి ఆదరణ:
వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మూడుసార్లు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ రెండుసార్లు గెలుపొందారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తమదైన మార్క్ చూపించారు. పార్టీలోనూ, ప్రజల్లోనూ వీరికి మంచి ఆదరణ ఉంది. నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించడమే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకుని మరీ విజయం సాధించగలిగారు. మరోపక్క, వైసీపీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. అందుకే ఆ నియోజకవర్గాల్లో గెలవలేకపోయింది.
డిసైడింగ్ ఫ్యాక్టర్ మత్స్యకారులే:
వాస్తవానికి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులతో పాటు మైనార్టీలు, ఇతర సామాజికవర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మత్స్యకారులే కావడంతో ఆ వర్గానికే కేటాయించాలనేది డిమాండ్‌గా మారిపోయింది. ఇక్కడ ఇతర సామాజికవర్గాల అభ్యర్థులు బరిలోకి దిగినా నెగ్గుకురావడం అంత సులువు కాదని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఇక్కడ మత్య్సకారులకే టికెట్లు ఇచ్చాయి. వైసీపీ ద్రోణంరాజు శ్రీనివాస్‌ను నిలబెట్టింది. జనసేన ఓట్లను చీల్చినా సుమారు నాలుగు వేల ఓట్లతో వాసుపల్లి విజయం సాధించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కొత్త నాయకత్వం:
ఆ స్థానంలో వైసీపీకి నాయకత్వ లోటు ఉంది. ద్రోణంరాజు శ్రీనివాస్ నిన్న మొన్నటి వరకూ వీఎంఆర్డీఏ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఏదో ఒక నామినేటేడ్ పదవి ద్రోణంరాజుకు ఇచ్చి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరో నాయకత్వాన్ని తయారు చేయాలన్న ఆలోచనలో వైసీపీ ఉందట. ఈ నేపథ్యంలో వాసుపల్లి కుమారుల్లో ఒకరికి రాజకీయంగా అవకాశం కల్పిస్తే బాగుంటుందని స్కెచ్ వేసింది. ఇక, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. గవర సామాజికవర్గంలో పట్టున్న నాయకుడు. వైసీపీ వేవ్‌లోను 27 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఎమ్మెల్యేల కుమారులను పార్టీలోకి లాగేసే పని:
జీవీఎంసీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యేల కుమారులను పార్టీలోకి లాగేస్తే హైప్ వస్తుందని అంచనా వేస్తోంది అధికార పార్టీ. ప్రస్తుత వాసుపల్లి కుమారులు విద్యాభ్యాసం చేస్తుండగా… గణబాబు కుమారుడు ఇటీవల ఎన్నికల నుంచి యాక్టివ్ అయ్యారు. 2019లో ప్రచార బాధ్యతలన్నీ చూసుకున్నారు. పైగా ఎల్జీ పాలిమర్స్ ఉదంతం తర్వాత కనీసం అధిష్టానం అక్కడి ప్రజల వద్దకు రాలేదనే భావనలో గణబాబు ఉన్నారట. ఈ నేపథ్యంలో క్లీన్ ఇమేజ్ ఉన్న గణబాబును లాగడానికి ప్రయత్నాలు ప్రారంభించింది వైసీపీ.
టీడీపీలో కంఫర్ట్ లేదంట:
వివిధ కారణాల వల్ల గణబాబు కూడా టీడీపీలో అంత కంఫర్ట్‌గా లేరంట. పైకి కరోనా వల్ల హోం క్వారంటైన్‌లో ఉన్నామని చెబుతున్నా.. అసలు కారణం మాత్రం అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి పరంగా గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.
క్రెడిట్ అంతా ఆయా ఎమ్మెల్యేలకే వస్తుంది. దీంతో వారసులను ఆకర్షించాలనేది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఎమ్మెల్యేల కుమారులకు కండువాలు కప్పేయాలన్న ఆలోచన వెనుక అసలు కారణం జీవీఎంసీపై పూర్తి ఆధిపత్యం సాధించడం కోసం అనేది మరో టాక్. మరి వైసీపీ ఎత్తులు పారుతాయో లేదో చూడాలి.