Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి

పవన్ కల్యాణ్ ఏ పార్టీతో ఏ పొత్తు పెట్టుకుంటారో తెలియదని, వారాహి యాత్రలో తన ప్రసంగంతో మాత్రం ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు.

Vundavalli Arun Kumar

Vundavalli Arun Kumar – UCC: యూనిఫామ్ సివిల్ కోడ్ (Uniform Civil Code- ఉమ్మడి పౌర స్మృతి)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) తమ వైఖరేంటో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జగన్, చంద్రబాబు, పవన్ యూసీసీకి అనుకూలమో వ్యతిరేకమో తెలుపుతూ శ్వేత పత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. బీజేపీతో కలిసి ఉన్నంత మాత్రాన గుడ్డిగా బీజేపీని మద్దతు ఇవ్వనని పవన్ చెప్పారని అన్నారు. అందుకే జనసేనను కూడా శ్వేతపత్రం అడుగుతున్నానని వివరించారు.

పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తాను ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదని ఉండవల్లి అన్నారు. పవన్ వారాహి యాత్ర విజయవంతమైందని తెలిపారు. మిగిలిన హీరోలకంటే పవన్ కు కొంచెం అభిమానులు ఎక్కువే కాబట్టి యాత్రకు తరలివచ్చారని అన్నారు.

పవన్ కల్యాణ్ ఏ పార్టీతో ఏ పొత్తు పెట్టుకుంటారో తెలియదని, వారాహి యాత్రలో తన ప్రసంగంతో మాత్రం ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించారని తెలిపారు. యూసీసీ బీజేపీ అజెండాలో ఉన్నదే కానీ, బీజేపీ ప్రారంభించింది కాదని ఉండవల్లి అన్నారు. రాజ్యాంగంలోనే ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉందని ఆయన గుర్తుచేశారు. ఎవరు ఏ పని చేసినా సరైన జీతం తీసుకునే పరిస్థితి, చదువుకునేందుకు అనుకూల విధానం ఉండాలని రాజ్యాంగంలో ఉందని చెప్పారు. ఎక్కడ పేదరికం ఉందో అక్కడ జనాభా ఎక్కువగా ఉందని తెలిపారు.

ముస్లిం జనాభా ఎక్కువని అనవసరంగా ప్రచారం జరుగుతోందని ఉండవల్లి చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ను ముట్టుకోవద్దని లా కమిషన్ చెప్పిందని తెలిపారు. యూనిఫామ్ సివిల్ కోడ్ మామూలు విషయం కాదని అన్నారు. దేశంలోని చాలా కులాల్లో విడాకులు కుల పెద్దలు ఇచ్చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కులాలకు ఒకే కోడ్ తీసుకురాలేమని చెప్పారు. బీజేపీ నంబర్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు.

ఏ పార్టీకీ అంత సీన్ లేదు..
పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ లో బాధ్యులను ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఊరికే ఖర్చు పెట్టరు కదా? అని అన్నారు. కేంద్రం చేసిన అప్పులు లక్షల కోట్ల రూపాయలలో ఉన్నాయని, అసలు కేంద్రాన్ని విమర్శించేంత సీన్  ఏ పార్టీకీ లేదని అన్నారు. మనకున్న అష్ట దరిద్రాలకు కారణం కేంద్రమేనని చెప్పారు.

Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి నేను రాజీనామా చేయలేదు.. కానీ..: కిషన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు