ఢిల్లీ వెళ్లొచ్చినవారిలో 70 మందికి పాజిటివ్.. మరో 21 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నాం : సీఎం జగన్

  • Publish Date - April 1, 2020 / 12:01 PM IST

కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఏపీలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామందికి కరోనా సోకడంపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ మత సదస్సుకు వెళ్లిన ఏపీ వాసులకు కూడా వైరస్ సోకిందని చెప్పారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరిని తాము ట్రేస్ చేస్తున్నట్టు తెలిపారు.

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కలిసి ప్రయాణం చేసిన వారిని కూడా గుర్తిస్తున్నామని జగన్ చెప్పారు. వైరస్ వస్తే ఏదో జరిగిపోతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని, వృద్ధులపై వైరస్ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని తెలిపారు. వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం బాధ కలిగించే అంశంగా పేర్కొన్నారు. 

రాష్ట్రంలో 87 కేసులుంటే అందులో 70 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చినవాళ్లే ఉన్నారన్నారు. 1085 మంది రాష్ట్రం నుంచి ఢిల్లీ సదస్సుకు వెళ్లారని జగన్ చెప్పారు. 585 మందికి పరీక్షలు చేశాం.. 70 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో 21 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని అన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో కాంటాక్ట్ అయినవాళ్లు స్వచ్చందంగా 104కి కాల్ చేసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకుంటే తక్కువవుతుందని చెప్పారు. కేవలం 14 శాతం మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స తీసుకున్న తర్వాత చాలామందికి నయం అవుతుందని తెలిపారు. దేశాల ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకూ కూడా వైరస్ సోకిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందని జగన్ తెలిపారు.  

ఆక్వా రంగం, ఫుడ్ మిల్స్, ఆయిల్స్ మిల్స్ అందరూ పనిచేసుకోవచ్చు. మందులు తీసుకుంటూ డాక్టరు సలహాను పాటిస్తుండాలి. కరోనాను పూర్తిగా నయం చేయవచ్చునని చెప్పారు. జీతాలను వాయిదా వేసుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

రైతులు మధ్యాహ్నం వరకు తమ పనులు చేసుకోవచ్చునని అన్నారు. ఆక్వా రంగం బతకాలని, ఆక్వా రైతులు బతకాలన్నారు. కరోనా వచ్చిన వాళ్లను ద్వేషించవద్దని, దాన్ని తప్పుగా చూడొద్దని జగన్ సూచించారు. ఈ విపత్తు సమయంలో సహకరించాల్సిందిగా ప్రైవేటు ఆస్పత్రులకు జగన్ విజ్ఞప్తి చేశారు. 

Also Read | తెలంగాణ, ఆంధ్రా పై బండ వేసిన మర్కజ్ మసీద్