CM Jagan (Photo : Twitter)
CM Jagan – Pawan Kalyan : ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఏకంగా సీఎం జగన్ బరిలోకి దిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా ఫైర్ అయ్యారు. విమర్శల డోస్ పెంచారు. అమ్మఒడి సభలో పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్. నాలుగు పెళ్లిళ్లు, రౌడీ అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.
”పవన్ నోటికి అదుపు లేదు. మాటకు నిలకడ లేదు. ఆయనలా పూనకం వచ్చినట్లు మనం మాట్లాడలేము. రౌడీల్లా మీసాలు తిప్పలేము. నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేము. అభివృద్ధిలో దూసుకుపోతున్న జగన్ ప్రభుత్వమంటే.. చంద్రబాబుకు, పవన్‌కు కడుపుమంట” అని మండిపడ్డారు జగన్.
కురుపాంలో అమ్మఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్.
” ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అబద్ధాలు, మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారు. టీడీపీ అంటే తినుకో.. దండుకో..పంచుకో అనేలా మార్చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో బుక్కు తెచ్చి.. అధికారంలోకి వచ్చాక దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు. అదే వాళ్ల ట్రాక్ రికార్డ్.
మరోసారి అధికారం కోసం.. దుష్ట చతుష్టయం మేనిఫెస్టోతో డ్రామాలు ఆడుతోంది. వీళ్లకు తోడు దత్త పుత్రుడు కూడా ఉన్నాడు. ప్యాకేజీ స్టార్ వరాహి అనే లారీ ఎక్కి.. ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. పవన్ మాటకు అదుపు, నిలకడ లేవు. దత్తపుత్రుడిలా మనం తొడలు కొట్టలేము. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేము. మాట్లాడితే చాలు… చెప్పుతో కొడతా, గుడ్డలూడదీసి కొడతా అంటాడు. బూతులు మాట్లాడుతుంటాడు. నాలుగు పెళ్లిళ్లకు, నాలుగేళ్లకోసారి భార్యను మార్చడానికి పేటెంట్ హక్కులు పవన్ కే ఉన్నాయి. రాష్ట్రంలో మంచి జరుగుతుంటే భరించలేకపోతున్నారు. కడుపులో మంట, ఈర్ష్యతో వాళ్ల కళ్లు మూసుకుపోయాయి. 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత బాబు చేసిన మోసాన్ని ఎందుకు నిలదీయలేదు?
పొత్తుల కోసం నేను ఏరోజూ పాకులాడలేదు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో జరగబోయే కురుక్షేత్రంలో.. నాకు ప్రజలు, భగవంతుడు మాత్రమే అండగా ఉంటారు. నేను మీకు మంచి చేశాను అనిపిస్తేనే.. జరగబోయే ఎన్నికల యుద్ధంలో నాకు అండగా నిలవండి” అని ప్రజలను కోరారు సీఎం జగన్.