Srikakulam Rains: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరంవైపు దూసుకొస్తోంది. కలింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ అర్ధరాత్రికి గోపాల్ పూర్ – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం, విశాఖలో కుండపోత వానలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకండా వానలు కురుస్తున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి నాన్ స్టాప్ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.
వాయుగుండం ప్రభావం మరో 24 గంటలు ఉండే అవకాశం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
సముద్ర ప్రాంతం మొత్తం హై అలర్ట్ జారీ చేశారు. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో తీరం దాటే సమయంలో మరింతగా వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఒడిశా క్యాచ్ మెంట్ ఏరియా నుంచి శ్రీకాకుళం వస్తున్న ప్రధాన నదులు నాగావళి, వంశధార.. వీటికి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది. సుమారు లక్ష క్యూసెక్కుల వరకు వరద నీరు రావొచ్చని అంచనా వేశారు.
ఇక ఈదురు గాలులకు హోర్డింగ్స్ కూలే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే భారీ హోర్డింగ్స్ ను రిమూవ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాల్లో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం కంట్రోల్ రూమ్స్ కు కాల్ చేయొచ్చు. అటు విపత్కర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు అధికారులు.
Also Read: విశాఖలో గాలివాన బీభత్సం.. భయపెడుతున్న భీకర గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు..