Visakha Rains: విశాఖలో గాలివాన బీభత్సం.. భయపెడుతున్న భీకర గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు..

విశాఖపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది.

Visakha Rains: విశాఖలో గాలివాన బీభత్సం.. భయపెడుతున్న భీకర గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు..

Updated On : October 2, 2025 / 5:33 PM IST

Visakha Rains: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. కళింగపట్నానికి ఇది 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ అర్థరాత్రి గోపాల్ పూర్ – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖలో కుండపోత వానలు పడుతున్నాయి.

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. విశాఖపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్థంభాలు, హోర్డింగ్ లు నేలకూలుతున్నాయి. ద్వారకానగర్ లో ఓ కారుపై భారీ వృక్షం పడిపోయింది.

Also Read: టాలీవుడ్ నిర్మాతకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన జనసేనాని.. ఆ సినిమా క్యాన్సిల్..?

విశాఖ నగరంలో చాలా చోట్ల రాకపోకలు స్తంభించాయి. భారీ గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. విరిగిపడ్డ చెట్లను తొలగిస్తున్నారు. రాకపోకలు సాగేలా చూస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భీకరమైన గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలోనూ భీకరమైన గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చెట్ల కింద నిలబడొద్దని సూచించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండరాదన్నారు. ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని తీవ్ర వాయుగుండం పయనిస్తోందని, దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విశాఖలో ఉదయం నుంచి నాన్ స్టాప్ వానలు పడుతున్నాయి.