BJP Strategy On Alliance : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు.. బీజేపీ వ్యూహం ఏమిటి?

అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్‌ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌ అవుతూనే ఉన్నాయి..

BJP Strategy On Alliance

BJP Strategy On Alliance : ఏపీలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా? లేదా? మూడు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయని జనసేనాని పవన్‌ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. టీడీపీ కూడా పొత్తుకు సై అంటూనే ఉంది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా పొత్తు సంకేతాలిస్తూనే ఉంది.. అంతా ఓకే అన్నట్లు కనిపిస్తున్నా.. ఎక్కడో డౌట్‌ కొడుతోంది.. పొత్తుపై రకరకాల వ్యాఖ్యానాలు.. అనేక రకాల ఊహాగానాలతో ఎప్పుడూ పొత్తు పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌ అవుతూనే ఉన్నాయి..

తాజాగా ఏపీ బీజేపీ లీడర్లతో ఆ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌ భేటీ కావడంతో మరోసారి పొత్తు రాజకీయాలపై హాట్‌ డిబేట్‌కు తెరలేచింది.

ఏపీలో పొత్తు లెక్కలు ఎప్పటికీ చిక్కుముడిగానే..
రాజకీయాలు.. ఎన్నికలు అంటే పార్టీలు… పొత్తులు…. కూటములు వంటి లెక్కలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ లెక్కల్లోనే ఎవరి ఎత్తులు వారివి… పొత్తు రాజకీయాల్లో జాతీయ పార్టీలు ఓ విధానం అనుసరిస్తే… ప్రాంతీయ పార్టీలది మరో విధానం… దీర్ఘకాలిక దృష్టితో జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రం అంతా ఇన్‌స్టెంట్‌ విధానంలో పొత్తులకు రెడీ అవుతుంటాయి. జాతీయ రాజకీయ సమీకరణలతో ఏ రాష్ట్రంలో ఎవరిని కలుపుకోవాలి? ఎవరిని దూరం పెట్టాలనేది కేంద్రంలో చక్రం తిప్పే పార్టీల లెక్క. కానీ, ప్రాంతీయ పార్టీలకు ఇవేవీ అవసరం ఉండవు. తమతో కలిసే పార్టీతో తమ తమ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే ఒక్క లెక్కే ప్రాతిపదిక… అందుకే ఏపీలో పొత్తు లెక్కలు ఎప్పటికీ చిక్కుముడిగానే ఉంటున్నాయి.

పొత్తుపై సందేహాలు..!
ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ… అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి మధ్యే ఎన్నికల యుద్ధం. సింహం సింగిల్‌గానే అన్నట్లు అధికార వైసీపీ ఎప్పుడూ పొత్తు రాజకీయాలకు దూరంగానే ఉంటోంది. కేంద్రంలో అవసరమైతే మద్దతు ఇవ్వడమే కాని, ఏ జాతీయ పార్టీతోనూ రాష్ట్రంలో చెలిమి చేయదు వైసీపీ.. ఆ పార్టీ లెక్క తొలి నుంచే అంతే.. ఇక టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పుడూ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి తొలి నుంచి ఉన్న అలవాటు. గత ఎన్నికల్లో బీజేపీకి దూరమైన టీడీపీ… ఈ ఎన్నికల్లో మళ్లీ దగ్గరవ్వాలని చూస్తోంది.

బీజేపీ పెద్దలు కూడా ఎన్‌డీఏలో మరిన్ని పార్టీలు చేర్చుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఇంతవరకు సాఫీగా జరిగినట్లు కనిపిస్తున్నా… ఇప్పటివరకు పొత్తు లెక్కలు మాత్రం తేలడం లేదు. పొత్తు ఉంటుందని కొందరు.. ఉండదని కొందరు బహిరంగ ప్రకటనలు చేయడం, టీడీపీ-జనసేన కూటమి బీజేపీతో సంబంధం లేకుండా టికెట్లు ప్రకటన చేయడంతో పొత్తుపై సందేహాలు తలెత్తుతున్నాయి.

పొత్తులపై అభిప్రాయాల సేకరణ..
ఇలా మూడు పార్టీల మధ్య పొత్తు టెన్షన్‌ ఉండగానే, బీజేపీ కీలక నేత, సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాశ్‌…. విజయవాడలో బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ కావడం, పొత్తులపై నేతల అభిప్రాయాలు సేకరించడం హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీతో పొత్తు ఉంటుందని, ఆ పార్టీ తమతో కలిసి పోటీ చేయాలని జనసేనాని పవన్‌ దాదాపు రెండేళ్లుగా చెబుతున్నారు. 2019 నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్‌, అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీతో సంబంధం లేకుండానే టీడీపీతో అవగాహన కుదుర్చుకున్నారు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుతూనే ఉన్నారు పవన్‌. ఐతే పవన్‌ సూచనలపై బీజేపీలో కొద్దికాలంగా అంతర్మథనం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో కొందరు నేతలు పొత్తులు లేకుండా పోటీ చేయాలని భావిస్తే, మరికొందరు మాత్రం పొత్తులపై ఆసక్తిగా ఉన్నారు.

పొత్తు ఉంటేనే గెలుపు అవకాశాలు ఎక్కువ..!
టీడీపీ-జనసేన కూటమి రాష్ట్రంలో ప్రధాన పోటీదారుగా అవతరించింది. వైసీపీని ఓడించాలంటే పొత్తు లేకుంటే కుదరదన్న వైఖరితో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. అందుకే బీజేపీ నిర్ణయం కోసం ఎదురుచూడకుండా ఏకపక్షంగా తొలి జాబితాను ప్రకటించాయి. దీంతో పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు… జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపారు. ఆ రెండు పార్టీలు టికెట్లు ప్రకటించేస్తే, తమకు బలం ఉన్న స్థానాల్లో ఆయా పార్టీలకు మద్దతు పలకడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే 175 నియోజకవర్గాలకు పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఐతే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, స్వామి పరిపూర్ణానంద వంటి వారు పొత్తులు ఉండాల్సిందేనని చెబుతున్నారట. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరితే పరిమిత సంఖ్యలోనే పోటీ చేసే చాన్స్‌ ఉన్నా, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది వీరి ఆలోచన అంటున్నారు.

పొత్తు ఉంటే మేలా? కాదా?
పార్టీ హైకమాండ్‌ సూచనలతో విజయవాడలో నేతలతో భేటీ అయిన శివప్రకాశ్‌ మాత్రం…. పొత్తు అనుకూల, వ్యతిరేక నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పొత్తు ఉంటే మేలా? కాదా? అన్న విషయంతో పాటు పొత్తు లేకుండా వంటరిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరడం ఖాయమనే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీయేని విస్తరించాలనే ఉద్దేశంతో మరిన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ లోగానే పొత్తులపై ప్రకటన వెలువడే చాన్స్‌ ఉందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

Also Read : విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎవరు? అధికార, విపక్షాలకు సవాల్

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు