ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా “మత్స్యకారుల సేవలో” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద సముద్రంలో వేట విరామం వేళ ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇస్తారు.
ఈ పథకం ద్వారా 1,29,178 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఏపీ సర్కారు ఈ పథకం కోసం మొత్తం రూ.258 కోట్లు ఖర్చు చేస్తుంది. ఏపీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు మత్స్యకార కుటుంబాలకు ఈ సాయాన్ని అందజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మత్స్యకారులతో ఇవాళ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Also Read: భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. ఇండియాలో పెరిగిపోనున్న వీటి ధరలు
శ్రీకాకుళం జిల్లాలో 104 తీరప్రాంత గ్రామాలు, 60 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,600 ఇంజన్ బోట్లతో, 2800 సంప్రదాయ పడవలను వాడుతూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ ఈ సంవత్సరం మత్స్యకార భరోసా కింద అర్హుల పేర్లను గుర్తించింది.
కాగా, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించి కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం మత్స్యశాఖ స్టాళ్లను ప్రారంభించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మత్స్యకారుల కష్టాలను తాను దగ్గరి నుంచి చూశానని, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సంకల్పంతో అర్హత ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.