Srisailam Drone
Srisailam Drone : శ్రీశైలంలో అనుమానాస్పద డ్రోన్ల గుట్టు విప్పేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు ..వివిధ ప్రాంతాల్లో మూడు బృందాలుగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.. సీఐ వెంకటరమణ. ఆలయ వసతి విభాగంతో పాటు, సత్రంలోని పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాట్లు చెప్పారు. డ్రోన్ ఆపరేటర్‌ను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అసలేం జరుగుతోంది..? అర్ధరాత్రి వేళ..రోజూ డ్రోన్లు ఎందుకు సంచరిస్తున్నాయి..? అసలు డ్రోన్లను ఎవరు…ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు..? వారి లక్ష్యమేంటి..?
Read More : Jammu Airport : డ్రోన్ దాడిలో కీలక విషయాలు, పాక్ ఉగ్రవాదుల పనే!
ఐదు రోజుల నుంచి డ్రోన్ల సంచారం : –
ఐదు రోజుల నుంచి డ్రోన్ల సంచారం కలకలం సృష్టిస్తున్నా పోలీసులు, అటవీ సిబ్బంది కలిసి శ్రీశైలాన్ని జల్లెడ పడుతున్నా… వాటి జాడ కనిపెట్టలేకపోతున్నారు. డ్రోన్ల ప్రయోగం ఆకతాయిల పనా లేక…ఉగ్రకోణం ఉందా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. డ్రోన్ల జాడ గుర్తించి..వాటిని పట్టుకోవాలని…శ్రీశైలం ఆలయం భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రోన్ల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండగానే… ఆదివారం అర్ధరాత్రి మరోసారి డ్రోన్ కనిపించింది. దీంతో డ్రోన్ల కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి అన్ని సత్రాలు, దేవస్థానం విభాగాలను జల్లెడ పడుతున్నారు.
ఉగ్రవాదుల లిస్ట్ లో పుణ్యక్షేత్రం : –
ఈ డ్రోన్లు అత్యంత ఎత్తులో తిరుగుతూ మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, ఔటర్ రింగ్‌రోడ్, రిజర్వాయర్ వంటి ప్రదేశాలను ఫొటోలు, వీడియోలు తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం డ్రోన్ తక్కువ ఎత్తులోకి రావడంతో గమనించిన భద్రతా సిబ్బంది ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనకాల తక్కువ ఎత్తులోకి వచ్చిన డ్రోన్‌ను గమనించిన అధికారులు…దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించారు. దీంతో ఆ డ్రోన్‌ను నియంత్రిస్తున్నవారు సిగ్నల్స్ నిలిపివేశారు. దీంతో డ్రోన్ అదృశ్యమయింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. దీంతో డ్రోన్ కదలికలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More : Nokia G20 : భారత్‌లో నోకియా బడ్జెట్ ఫోన్ ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
ఆలయ అధికారుల ఫిర్యాదు : –
డ్రోన్ల సంచారంపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలంలోని అన్ని సత్రాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ అధికారులతో కలిసి నల్లమలను గాలిస్తున్నారు. డ్రోన్లు ఎక్కడినుంచి ప్రయోగించారు..? ఎందుకు ప్రయోగించారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అటు శ్రీశైలంను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.