Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరుతుందా? లేదా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్నా.. కేంద్ర కేబినెట్ లో జనసేన చేరికపైనే సందిగ్ధత నెలకొంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా బలం లేకపోవడంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు ఎంతో కీలకంగా మారింది. బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన టీడీపీ, జనతాదళ్ మోదీ కేబినెట్ లో చేరికపై చర్చలు సాగుతున్నాయి. దీంతో జనసేనకు క్యాబినెట్ లో బెర్త్ దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 2 సీట్లనూ గెలుచుకుంది. జనసేన ఇద్దరి ఎంపీలలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సీనియర్ నేత. మొత్తం మూడుసార్లు గెలిచారు. గత ఎన్నికల ముందే ఆయన జనసేనలో చేరారు. కేబినెట్ లో జనసేన చేరాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలిస్తారని అంటున్నారు. ఇక మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన ఉదయ్ శ్రీనివాస్ తొలిసారే ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో బాలశౌరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.
2004లో పొన్నూరు జిల్లా తెనాలి ఎంపీగా తొలిసారి గెలిచిన బాలశౌరి.. నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత పోటీ చేయలేకపోయారు. ఇక 2019లో వైసీపీ తరుపున మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన తరుపున భారీ మెజార్టీ సాధించారు.
కేంద్ర క్యాబినెట్ లో జనసేన చేరికపై తర్జనభర్జన కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. జనసేనను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. కేబినెట్ ర్యాంక్ తో మంత్రి పదవి ఇస్తారా? లేక ఇండిపెండెంట్ హోదాతో సహాయ మంత్రి పదవి ఇస్తారా? అన్నది చూడాలి.
ఇక, కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరిక దాదాపు ఖాయమైంది. రాష్ట్రం నుంచి టీడీపీకి 2 నుంచి 4 మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. అదే విధంగా రాష్ట్ర బీజేపీ నుంచి ఒకరికి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక జనసేనపైనే క్లారిటీ రావాల్సి ఉంది. తొలి నుంచి బీజేపీకి మద్దతుగా ఉండటమే కాకుండా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విషయంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని పవన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తిరేపుతోంది.
Also Read : జగన్‌ను కలవాలంటే పడిగాపులే..! జక్కంపూడి రాజా వ్యాఖ్యలతో ఏకీభవిస్తా- కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు