Kadapa Mayor, Suresh Babu issue
కడప మేయర్ సీటుకు ఎసరు పెడుతోంది టీడీపీ. వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాఖలో ఆయనకు ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేస్తూ..మేయర్‌ను కుర్చీ దించేదాకా ఊరుకోనంటున్నారు ఎమ్మెల్యే మాధవి. అన్నట్లుగానే మేయర్ సురేష్ బాబు వెంటే పడుతున్నారు. అడ్డగోలుగా అవినీతి చేశారని..ఆ వ్యవహారం మొత్తం బయటికి తీస్తానంటూ..కుటుంబ సభ్యుల పేరుతో అతడు కాంట్రాక్టులు చేసి కాసులు కాజేశారని గళమెత్తుతున్నారు.
కడప కార్పొరేషన్‌లో నువ్వానేనా అని సాగుతున్న పొలిటికల్ ఫైట్‌లో భాగంగా మేయర్ సురేష్‌బాబును కార్నర్ చేస్తున్నారు ఎమ్మెల్యే మాధవి. సొంత కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టులు చేయొద్దన్న నిబంధలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్రజాధనం దుర్వినియోగం చేశారని కూడా ఎమ్మెల్యే విమర్శల బాణాలకు ఎక్కు పెడుతున్నారు. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయని..మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిందంటున్నారు ఎమ్మెల్యే.
కడప కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యేకు ఛైర్ వేయకుండానే..మేయర్ సురేష్ బాబు మీటింగ్ నిర్వహించడం అప్పట్లో గందరగోళానికి దారి తీసింది. కుర్చీ వేసే వరకు ఊరుకునేది లేదని టీడీపీ..ఆమెకు కుర్చీ వేయకుండానే సమావేశం నిర్వహించాలని వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టడంతో రచ్చ జరిగింది. అదే సమయంలో తనను అవమానించిన మేయర్‌కు ఆ పదవే లేకుండా చేస్తానంటూ శపథం చేశారు ఎమ్మెల్యే మాధవి.
మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపణలు
అన్నట్లుగానే.. కొన్నాళ్లుగా మేయర్ సురేష్‌బాబు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ఆరా తీస్తూ..అతడ్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సురేష్‌బాబు మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపణలు చేస్తున్నారు. మేయర్ తన కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేశారని చెబుతున్నారు. మేయర్ భార్య జయశ్రీ, ఆయన కుమారుడు అమరేష్ పేర్లపై ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో..55.64 లక్షల పనులు చేశారని..విజిలెన్స్ విచారణలో కూడా ఆ విషయం బయటపడిందంటున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టు బిల్లులు డ్రా చేశారని ఎమ్మెల్యే మాధవి అలిగేషన్స్ చేస్తున్నారు.
15 రోజుల గడువులోగా మేయర్ వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ షోకాజ్ నోటీసులు పంపిందని అంటున్నారు టీడీపీ నేతలు. సురేష్‌బాబు మాత్రం తనకు ఎలాంటి షోకాజ్ నోటీస్ అందలేదంటున్నారు. ఎమ్మెల్యే మాధవి అయితే ఈ నెల 24 నుంచి 15 రోజుల గడవులోగా మేయర్ సమాధానం చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మేయర్‌కు షోకాజ్ నోటీసుల ఇష్యూ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. మేయర్‌కు మున్సిపల్ శాఖ నోటీసులు ఇచ్చిందా లేదా?
ఒకవేళ నోటీసులు ఇస్తే మేయర్ సురేష్‌బాబు ఏమని సమాధానం చెప్తారన్న దానిపై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ కుటుంబ సభ్యుల పేర్లతో కాంట్రాక్టులు చేసినట్లు తేలితే మాత్రం మేయర్ సీటుకు ఎసరు వచ్చినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ కోటాలో ఉన్న మేయర్ సురేష్ బాబుపై వేటు తప్పదా అన్న చర్చ జరుగుతోంది. కడప గడపలో టీడీపీ వేస్తున్న స్కెచ్‌లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.