ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో మద్యం స్కాం జరిగిందంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక సిట్ ఈ విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. సిట్ విచారణకు రావాలంటూ కసిరెడ్డికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన కంటిన్యూస్‌గా డుమ్మా కొడుతున్నారు తప్ప.. విచారణకు వచ్చిందే లేదు.
అధికారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చారు అధికారులు. మరి ఈసారైనా కసిరెడ్డి విచారణకు వెళ్తారా.. ఒకవేళ వెళ్లకుంటే సిట్అధికారులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది. కసిరెడ్డి కోసం బుధవారం మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు ఎదురుచూశారు. కసిరెడ్డికి ఫోన్లు చేస్తే.. ఆయనకు చెందిన ఫోన్లు అన్నీ స్విచ్‌ఆఫ్‌గా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది.
కసిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో కూడా హైదరాబాద్‌లో ఆయన లేరని అధికారులు గుర్తించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించి, ఆయన బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇంతకుముందు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు.
Also Read: వావ్.. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..
పలుసార్లు నోటీసులు
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివసించే జర్నలిస్టు కాలనీలోని ఇంటికి సిట్ అధికారులు మార్చి 25న మొదటిసారి నోటీసులు పంపారు. అదే నెల 28న విచారణకు రావాలని ఆదేశించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పనివాళ్లకు ఇచ్చారు. రెండోసారి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్‌లో ఉంటున్న ఆయన తల్లికి 26న నోటీసులు అందజేశారు. అందులో మార్చి 29న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు.
దీంతో ఈ-మెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి… వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలిక పెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్ బదులివ్వడంతో ఇందులో తనకు ఏ సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… సిట్ నోటీసులకు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. సిట్ అధికారులు కసిరెడ్డికి మళ్లీ నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇచ్చారు అధికారులు.
వైసీపీ హయాంలో వేల కోట్ల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ వ్యవహారాల పైన విచారణకు ఆదేశించారు. అయితే వైసీపీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. బయటకు వచ్చిన విజయ సాయిరెడ్డి సైతం లిక్కర్ స్కాంలో కర్మ, కర్త, క్రియ అంతా కసిరెడ్డి అంటూ బాంబు పేల్చారు. ఈ కేసులో మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు కసిరెడ్డిపాత్రపై ఫోకస్ పెట్టి ఆధారాలు సేకరించారు.
2019 ఎన్నికలకు ముందు జగన్‌తో కలసి పనిచేసిన కసిరెడ్డి… వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో అక్కడ లిక్కర్ బిజినెస్ చేసినట్లు గాసిప్స్ గుప్పుమంటున్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసుల విచారణ ఎదుర్కొన్న వాసుదేవ రెడ్డి సైతం కసిరెడ్డి పేరు ప్రస్తావించారట. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో… ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయిం చాలో కసిరెడ్డే నిర్ణయించేవారని టాక్ వినిపిస్తోంది. అయితే ఐటీ సలహాదారుడిగా ఉన్న తనకు నోటీసులు ఎలా ఇస్తారని కసిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.