Tirupati Stampede : తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ లోకి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. మృతులను పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.
మృతులు వీరే..
రజిని(47) – విశాఖ
రాజేశ్వరి, మల్లిక (49)- తమిళనాడు
నాయుడుబాబు (51)-నర్సీపట్నం
శాంతి(40) విశాఖ
తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచి వేసింది- పవన్ కల్యాణ్
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్ కల్యాణ్. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మరోసారి ఇలాంటి ఘటనలు జరగొద్దు- మంత్రి నారా లోకేశ్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఒక్కసారిగా భక్తులు రావడంతోనే తొక్కిసలాట- బీఆర్ నాయుడు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అని వాపోయారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని ఆయన వివరించారు. తిరుపతిలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్లు చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.
దర్శనం కోసం వచ్చి భక్తులు మృతి చెందడం అత్యంత విచారకరం- జగన్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దర్శనం కోసం వచ్చి భక్తులు మృతి చెందడం అత్యంత విచారకరం అన్నారు జగన్. పరిస్థితులను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులు దీనికి కారణం అంటున్నారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్..
వైకుంఠ ద్వార దర్శనం టోకెట్ల జారీలో అపశ్రుతి జరగడంపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఏర్పాట్లు చేశామని సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారని మండిపడింది. ఇవేనా భక్తులకు మీరు అందించే సేవలు? అంటూ ఫైర్ అయ్యింది.
Also Read : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య