Tirupati Tragedy : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య

బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tirupati Tragedy : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య

Updated On : January 9, 2025 / 12:15 AM IST

Tirupati Tragedy : తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య 6కి చేరింది. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన
తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు.

శ్రీనివాస అతిథిగృహం దగ్గర జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. తొక్కిసలాట ఘటనలో 40 మంది గాయపడ్డారు. బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు. క్యూలైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది.

నిజానికి గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది. అయితే, ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.

భక్తులను క్యూలైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు. ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు భక్తులు కిందపడ్డారు. వారిని వెనకున్న వారు తొక్కేశారు. ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరి ఆడక ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read : తిరుపతిలో తీవ్ర విషాదం.. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి