Tirupati Tragedy : తిరుపతిలో విషాదం.. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి
భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది.

Tirumala (Photo Credit : Google)
Tirupati Tragedy : తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగ్గా ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండగా.. సాయంత్రం నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది.
తిరుపతిలో ఊహించని దుర్ఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. బైరాగి పట్టెడ కేంద్రం వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. టోకెన్ల కోసం క్యూలైన్ లోకి తోసుకొచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఊపిరి ఆడక చాలా మంది ఇబ్బంది పడ్డారు. 5 అంబులెన్సులలో సుమారు 15 మంది ఆసుపత్రికి తరలించారు.
వారిలో నలుగురు, ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ పార్క్ వద్ద వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు సమాచారం.
తిరుపతి నగరంలో 9 కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. అయితే, అనుకోకుండా భక్తుల రాత్రి సమయానికే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారంతా క్యూలైన్ లోకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పంపిణీ చేయడానికి ముందు రోజు రాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి నగరానికి చేరుకుంటూ ఉంటారు. ఇది సర్వ సాధారణం. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా తమిళనాడు, కర్నాటక, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ముందు రోజు రాత్రే వచ్చి క్యూలైన్ లో నిల్చుంటారు. సాధారణంగా క్యూలైన్లను అర్థరాత్రి ఓపెన్ చేస్తారు. ఆ తర్వాతే భక్తులు క్యూలైన్ లోకి వెళ్తారు. అయితే, ఊహించిన దానికంటే అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ లోకి వెళ్లే క్రమంలో భక్తులు ఎగబడ్డారు. అది తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.
Also Read : నెల్లూరు జిల్లాలో కాకాణి రేపిన కాక ఏంటి? ఆయనపై కేసు ఎందుకు నమోదైంది?