Roja
ఆర్కే రోజా. లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ మహిళా నేత. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కొంతకాలం టీడీపీలో పనిచేశారు రోజా. తర్వాత వైసీపీ కీలక లీడర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్‌గా ఆమెకు ఎప్పుడు తలనొప్పులు ఉంటూనే ఉన్నాయట.
వైసీపీలో చేరాక అయితే రోజా మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారట. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి మంత్రిగా పనిచేసిన రోజాకు..ఓడినా, గెలిచా..ఇంటా, బయటా ఇక్కట్లు తప్పట్లేదట. ఇప్పుడు మరోసారి ఆమెకు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలో కుంపటి తయారు అవుతోందన్న టెన్షన్ పట్టుకుందట.
సీనియర్ టీడీపీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీశ్‌ను వైసీపీలోకి తీసుకొచ్చి తనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారట రోజా. గాలి జగదీష్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఇటీవలే ఆమె అడ్డుకోగలిగినప్పటికీ, దీని వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు రోజా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రోజా
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన రోజా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పుడు ప్రతిపక్షంలోనానా కష్టాలు పడ్డారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. మొన్నటి 2024 ఎన్నికల్లో ఆమెకు ఓటమి తప్పలేదు.
గత ఎన్నికల్లోనూ ఆమెకు నగరి వైసీపీ టికెట్ రాకుండా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ పట్టుబట్టి మరీ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఓటమి తర్వాత ఈ ఆరు నెలలు ఆమె గుళ్లు గోపురాలకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అపోజిషన్‌లో ఉండి అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న రోజాకు..సొంత పార్టీలో కుంపటి హెడెక్‌గా మారిందట.
దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ముద్దు కృష్ణమనాయుడు మరణం తర్వాత ఆయన ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాశ్, గాలి జగదీశ్‌లు రాజకీయ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పట్లో టీడీపీ అధిష్టానం వాళ్లిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నానా తంటాలు పడింది.
చివరకు గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కొడుకు గాలి భానుప్రకాశ్‌ను నగరి టీడీపీ ఇంచార్జ్‌గా నియమించింది. తీవ్ర నిరాశకు గురైన గాలి జగదీశ్ రాజకీయాలకు దూరమయ్యారు. కానీ తన సోదరుడు గాలి భానుప్రకాశ్‌పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు గాలి జగదీష్ వైసీపీలో చేరి నగరి వైసీపీ టికెట్ దక్కించుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
దీని వెనుక వైసీపీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. నగరి టికెట్ విషయంలో వైఎస్ జగన్ సమక్షంలోనే పంచాయితీ కూడా జరిగింది. చివరకు రోజానే బరిలోకి దించారు వైసీపీ అధినేత. దీంతో గాలి జగదీశ్ వైసీపీలో చేరికకు బ్రేక్ పడింది. సొంత అన్న భానుప్రకాశ్‌ను దెబ్బ కొట్టాలన్న కసి మీదున్న గాలి జగదీశ్ ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ పార్టీ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారట.
గాలి జగదీశ్ మధ్యలోనే ఆగిపోయారా?
నాలుగు రోజుల క్రితం వైసీపీలో చేరేందుకు బయలుదేరిన గాలి జగదీశ్ మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికను రోజా మరోసారి అడ్డుకున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా వైసీపీలో చేరి సోదరుడు భానుప్రకాశ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్నది జగదీశ్ ఆలోచన కాగా..గాలి జగదీశ్ వైసీపీలోకి వస్తే తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనేది రోజా టెన్షన్ అట. ఇప్పటికైతే గాలి జగదీశ్ చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ పక్కలో బల్లెంలా రోజాను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది.
2014లో నగరి నుంచి రోజా గెలిచినప్పటి నుంచి..సొంత పార్టీలో వర్గపోరు ఆమెకు హెడెక్‌గానే మారింది. మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ కేజే కుమార్ దంపతులతో పాటు పలువురు నేతలు బహిరంగంగానే ఫ్యాన్ పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. అయితే మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని క్రియేట్ చేసి..తలనొప్పులు తెచ్చి పెడుతున్నారని రోజా ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు.
పెద్దిరెడ్డి మీద అసంతృప్తిని బయటికి చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయితీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా. ఇప్పుడు గాలి జగదీశ్ చేరికను కూడా అడ్డుకుని రోజా తన పంతం నెగ్గించుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు జగదీశ్ జాయినింగ్‌కు బ్రేక్ పడ్డప్పటికీ..రాబోయే ఎన్నికల వరకు ఏం జరగబోతుందోనన్న టెన్షన్ మాత్రం రోజాను వెంటాడుతూనే ఉందట. నగరి పాలిటిక్స్ ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయో చూడాలి మరి.