చంద్రబాబుతో చర్చల తర్వాత తేలనున్న గంటా శ్రీనివాసరావు భవిష్యత్‌

బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్‌ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.

Ganta Srinivasa Rao: అంతా ఊహించినట్టుగానే జరగింది. టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు గల్లంతైంది. విద్యాశాఖ మంత్రి.. సీనియర్ నేత బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్‌ ప్రతిపాదనను గంటా తిరస్కరించారు. భీమిలి ముద్దు.. చీపురుపల్లి వద్దు అంటున్నారు. మరి గంటా వాట్ నెక్ట్స్‌ అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతగా గంటాకు గుర్తింపు ఉంది.

అంతర్గత ఆలోచనలు వేరే..
ఈసారి గంటా శ్రీనివాసరావు కోసం బలమైన రాజకీయ ప్రత్యర్ధిని ఎంపిక చేసింది టీడీపీ. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టెందుకు గంటానే సరైన అభ్యర్థని భావించింది. ఆపరేషన్ బొత్స కోసమే ఈ ప్రయత్నమని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఐతే గంటా వర్గం ఆందోళన మరో విధంగా ఉంది. గంటా ఎప్పుడు విశాఖ దాటి తన రాజకీయాలను విస్తరించలేదు. దీంతో మంత్రి బొత్సపై పోటీకి చీపురుపల్లి వెళ్ళమనడం వెనుక అంతర్గత ఆలోచనలు వేరే ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

కుండబద్దలు కొట్టిన గంటా
కాపు సామాజిక వర్గానికి చెందిన గంటాను.. బొత్సపై పోటీ పెట్టాలనే ఆలోచనతోనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఎత్తుగడలను పసిగట్టిన గంటా తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు. అటూ మంత్రి బొత్స కూడా గంటా పోటీపై స్పందించారు. ఓడిపోయేందుకే తనపై పోటీకి చీపురుపల్లి వస్తున్నారని వ్యాఖ్యానించారు.

Also Read: పెనుకొండ టీడీపీలో ఎగిసిన అసమ్మతి జ్వాలలు.. కార్యకర్త ఆత్మహత్యాయత్నం

పునరాలోచనలో అధిష్టానం
సీట్ల కేటాయింపులో కాపులకు అన్యాయం జరుగుతోందని బలంగా వినిపించాలని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి గంటా వ్యవహారం తోడైతే మరింత వ్యతిరేకత రావొచ్చని టీడీపీ పునరాలోచనలో పడింది. ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబును గంటా కలవనున్నారు. తనకు భీమిలి నుంచి పోటీ చేసే అంశం పరిశీలించాలని.. టిక్కెట్ ఇస్తే ప్రత్యర్ధితో సంబంధం లేకుండా గెలిచి వస్తానని చెప్పబోతున్నారట మాజీమంత్రి. అధిష్టానం సైతం చీపురుపల్లి విషయంలో ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏనాయుడు పేర్లను పరిశీలిస్తోంది.

Also Read: ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

భీమిలి నుంచే బరిలోకి?
ఇక భీమిలి సీటుపై జనసేన ఆశలు పెట్టుకున్నప్పటికీ సర్దుబాటులో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రజారాజ్యం గెలిచిన టిక్కెట్లు బెంచ్ మార్క్‌గా నాలుగు టిక్కెట్లు తీసుకోవాలని జనసేన ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చింది. ఈ దిశగా అనకాపల్లి సీటు ఖరారైంది. మిగిలిన మూడు సీట్లు పెందుర్తి, విశాఖ దక్షిణం, యలమంచిలి కానున్నాయని సమాచారం. దీంతో గంటాను మరోసారి భీమిలి నుంచి బరిలోకి దించడం అనివార్యంగా టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు టాక్‌. చంద్రబాబుతో చర్చల తర్వాత మాత్రమే గంటా భవిష్యత్ తేలనుంది.

ట్రెండింగ్ వార్తలు