రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.

Rushikonda Hill Resorts : రుషికొండ రాజభవన రహస్యాలను గంటా శ్రీనివాసరావు బయట పెట్టినప్పటి నుంచి ఏపీలోనే కాదు… మొత్తం దేశమంతా దీని గురించే చర్చ జరుగుతోంది. అసలా భవనాలను అంత ఖర్చుపెట్టి అంత అధునాతనంగా ఎందుకు తీర్చిదిద్దారు..? పనులు జరుగుతున్నన్ని రోజులు ఎవరినీ ఎందుకు అనుమతించలేదు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల కోసం నిర్మించినప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి..? ఇప్పుడీ రాజప్రసాదాలను టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

శీష్ మహల్ ఆఫ్ ద సౌత్.. రుషికొండ భవనాలపై దేశవ్యాప్తంగా చర్చ..
ఐదారు రోజులుగా రుషికొండ భవనాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో సైతం దీనిపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని విలాసవంత భవనాలకు ఉపయోగించి దుర్వినియోగం చేశారని రాజకీయ నిపుణులు, సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు. జాతీయ మీడియా శీష్ మహల్ ఆఫ్ ద సౌత్ అని విమర్శిస్తూ కథనాలు రాస్తోంది. వైసీపీ మాత్రం రుషికొండ నిర్మాణాలపై వస్తున్న విమర్శలపై ఎదురుదాడికి దిగింది. అద్భుతమైన నిర్మాణాలు చేపడితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అప్పుడొక మాట, ఇప్పుడొక మాట..
అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయంగా, లేదంటే పర్యాటక శాఖ వాడుకునే విధంగా భవనాలు నిర్మించామని ఎన్నికలకు ముందు స్థానిక మంత్రి అమర్‌నాథ్, పర్యాటక మంత్రి రోజా చెప్పారు. సీఎం అక్కడ నివాసముంటే తప్పేంటని అప్పుడు బొత్స వంటి మంత్రులు ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం.. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల కోసమే వాటిని నిర్మించామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

భార్యకు బీచ్‌ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తానన్న జగన్?
భార్యకు బీచ్‌ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పిన వైసీపీ అధినేత…అందుకు తగ్గట్టుగానే బీచ్ వ్యూ ప్యాలెస్‌లు నిర్మించారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. రుషికొండ రాజభవనాల వెనక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామని ట్వీట్ చేశారు. అయితే వైసీపీ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. రాజప్రాసాదాల రహస్యం బట్టబయలైన రోజే వైసీపీ స్పందించింది. రుషికొండలో నిర్మించినవి ప్రయివేట్ ఆస్తులు కావని, ప్రభుత్వ భవనాలే అని తెలిపింది.

టీడీపీపై వైసీపీ ఎదురుదాడి..
విశాఖ పట్టణానికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని భవనాలు నిర్మించామని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమని తెలిపింది. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడం వల్ల టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ… విశాఖ ప్రజలకు మేలు జరగదని ట్విట్టర్‌లో విమర్శించింది. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు జోడించి.. బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించింది. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సీఎం, గవర్నర్ వంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలని వైసీపీ విమర్శించింది.

అప్పుడేమో సీఎం ఉండటానికి అన్నారు, ఇప్పుడేమో పర్యాటక భవనాలు అంటున్నారు..
విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక భవనం నిర్మించడం తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. వెన్ను చూపేది లేదు.. వెనకడుగు వేసేది లేదంటూ ట్వీట్ చేశారు. సీఎం ఉండటానికి భవనాలు నిర్మించామని గతంలో చెప్పిన రోజా ఇప్పుడు పర్యాటక భవనాలు అంటూ మాట మారుస్తున్నారని బుద్దా వెంకన్న దాడి చేశారు. మరోసారి అధికారంలోకొస్తే విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే క్రమంలోనే భవనాలను ఆధునికీకరించామని, సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని భావించారని మాజీ మంత్రి అమర్నాథ్ అంటున్నారు. మొత్తంగా అధికార టీడీపీ, వైసీపీ మధ్య ఇప్పుడు రుషికొండే హాట్‌టాపిక్.

ప్రముఖుల కోసమే కట్టి ఉంటే.. ఎందుకు రహస్యంగా ఉంచారు?
ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అతిక్రమించి మరీ కొండను తొలిచి నిర్మాణాలు సాగించాల్సిన అవసరమేంటి అన్నదానికీ వైసీపీ నేతలు స్పందించడం లేదు. పర్యాటకుల కోసమే 26లక్షల ఖర్చుతో బాత్ టబ్ నిర్మించారనడం నమ్మశక్యంగా లేదన్నది టీడీపీ సహా అనేకమంది చేస్తున్న ఆరోపణలు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు వైసీపీ నేతలు.

భవనాలను ప్రైవేట్ వ్యాపార సంస్థలకు లీజుకిస్తారా?
అత్యాధునిక హంగులతో ఉన్న భవనాలను ఇప్పుడేం చేయాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వానికి సవాల్ గా మారింది. సీఎం చంద్రబాబు త్వరలో విశాఖలో పర్యటిస్తారని భావిస్తున్నారు. ఏపీకి అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుషికొండ భవనాలు కార్పొరేట్ల సమావేశాలకు, దేశవిదేశీ ప్రముఖులు, సెలబ్రిటీలు బస చేయడానికి అనువుగా ఉన్నాయి. భవనాలను కొన్ని ప్రయివేట్ వ్యాపార సంస్థలకు లీజుకిచ్చి, ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న సూచనలు అందుతున్నాయి. సీఎం చంద్రబాబు దీనిపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Also Read : రుషికొండపై విలాసవంతమైన భవనాలు.. వైసీపీ నేతలు ఎందుకు రహస్యంగా ఉంచారు? ప్రచారం చేసుకోకపోవడానికి కారణమేంటి?

 

ట్రెండింగ్ వార్తలు