Perni Nani
పార్టీ ఓడినా..పవర్‌లో లేకున్నా..ప్రతీ విషయంలో అధినేత గొంతై..పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ నిత్యం లైమ్ లైట్ ఉంటూ వస్తున్నారు మాజీ మంత్రి పేర్నినాని. తన సొంత నియోజకవర్గమే కాదు..పార్టీలో ఏ నేతకు కష్టం వచ్చినా..కేసులతో జైలుకు వెళ్లినా వారికి అండగా నిలుస్తున్నారు. కొడాలి నాని అనారోగ్యం కారణంగా గుడివాడ పార్టీ యాక్టవిటీలో కూడా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పామర్రు, అవనిగడ్డ వైసీపీ కార్యకర్తల సమావేశంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి.
ఊరికే రప్పా రప్పా ఏంటీ..కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలి..అంటూ మాట్లాడి పెద్ద రచ్చకే దారి తీశారు. మహా అయితే అరెస్టు చేస్తారు..నాలుగు రోజులు జైల్లో ఉంటాను.. ఏమవుతుందంటూ కూడా గట్టిగానే మాట్లాడారు పేర్నినాని. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సైలెంట్ అయిపోయారు.
ఏ చిన్న విషయమైనా ప్రెస్‌మీట్ పెట్టి పార్టీ తరఫున వాయిస్ వినిపించే పేర్నినాని..లిక్కర్ స్కాం కేసులో ఏకంగా పార్టీ ఎంపీ అరెస్ట్ అయినా..అధినేత పేరు ఛార్జిషీట్‌లో ప్రస్తావించినా..ఎక్కడా మాట్లాడటం లేదు. ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ, అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లా నేతలంతా మద్దతుగా వచ్చినా పేర్నినాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అరెస్ట్ భయంతో పేర్నినాని పరార్ అయ్యారని..అజ్ఞాతంలోకి వెళ్లారని టీడీపీ విమర్శలు చేస్తోంది. అయినా పేర్నినాని రియాక్ట్ కావడం లేదు.
Also Read: “నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.. విడుదల అవుతారు” అంటూ కేఏ పాల్ సంచలన ప్రకటన
అయితే తాను చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో..పామర్రు పోలీసులు అరెస్టు చేస్తారన్న సమాచారంతో పేర్నినాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. పైగా ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని హైకోర్టుకెళ్లారు. రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు పెట్టారని, ఆ కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరో రెండ్రోజులకు వరకు పేర్నినాని విషయంలో ఎలాంటి చర్యలు వద్దంటూ కోర్టు ఆదేశించడంతో కాస్త రిలాక్స్ అయ్యారట. అయినా ఆయన ఇప్పట్లో మీడియా ముందుకు రావడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.
రెండ్రోజుల తర్వాత కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి పేర్నినాని రియాక్షన్ ఉండొచ్చు. అయితే పేర్నినాని కామెంట్స్‌పై టీడీపీ నేతలు సీరియస్‌గా ఉన్నారట. జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక భర్త రాముపై దాడి చేయించింది లోకేశే అంటూ ప్రచారం చేయాలన్న ఆడియోతో పాటు..రప్పా రప్పా కామెంట్స్‌పై కూడా లీడర్లు ఆగ్రహంతో ఉన్నారట. రేషన్ బియ్యం కేసులో వదిలేయడంతో పేర్నినాని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీడీపీ భావిస్తోందట.
అరెస్ట్ చేస్తే చేసుకోండి.. అంటూ స్టేట్‌మెంట్లు
మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఎక్కడ ఉన్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. బందరు నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. పేర్ని కోసం పోలీసులు వెతుకుతున్న ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానమే పేర్నినానీని సేఫ్ జోన్‌లో ఉంచిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుల్లో ముందస్తు బెయిలు లభించకపోవడంతో పేర్నినాని పరార్ అయ్యారని టీడీపీ అంటోంది. దీంతో బందరు రాజకీయం మరో మారు వేడెక్కింది.
వైసీపీ నేతలు కూడా పేర్నినాని ఎపిసోడ్‌పై స్పందించడం లేదు. అయితే పార్టీ తరఫున ప్రతీ విషయంలో వాయిస్ వినిపించే పేర్నినాని కూడా అరెస్ట్ అయితే..పార్టీ వాదనేంటో బలంగా ప్రజలకు వెళ్లడం కష్టమని భావిస్తోందట వైసీపీ. అందుకే కేసుల విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకు పేర్నినాని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారట. అరెస్ట్ అయ్యాక బెయిల్ రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని..ముందస్త బెయిల్ కోసమే ట్రై చేస్తున్నారట.
దమ్ముంటే ఎవరొస్తారో రండి..అరెస్ట్ చేస్తే చేసుకోండి..అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన పేర్నినాని ఇప్పుడు ఎందుకు పరార్ అయ్యారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఇప్పుడున్న కేసుల్లోనే కాదు..భవిష్యత్‌లోనూ జాగ్రత్తగా మాట్లాడకపోతే పేర్నినానికి కేసుల బెడదన్న తప్పదన్న టాక్ వినిపిస్తోంది. క్యాడర్‌లో జోష్ నింపే క్రమంలో టంగ్ స్లిప్ అయితే..ముఖం చాటేయాల్సి వస్తుందని..ఇప్పుడు పేర్నినాని అదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయ్. ఆయనపై నమోదైన కేసులపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో..పేర్నినాని ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో చూడాలి మరి.