“నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.. విడుదల అవుతారు” అంటూ కేఏ పాల్ సంచలన ప్రకటన

"నిమిషను తీసుకురావడం కోసం దౌత్యవేత్తలను పంపడానికి సిద్ధంగా ఉన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

“నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు.. విడుదల అవుతారు” అంటూ కేఏ పాల్ సంచలన ప్రకటన

Updated On : July 22, 2025 / 8:48 PM IST

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. యెమెన్‌లోని సనా నుంచి పలువురితో కలిసి ఆయన వీడియో రూపంలో మాట్లాడారు.

నిమిష ప్రియ మరణశిక్ష రద్దయిందని కేఏ పాల్ ప్రకటించారు. యెమెన్, భారత్‌ ప్రతినిధులు జరిపిన చర్చల వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. గత పది రోజులుగా నాయకులు రాత్రింబవళ్లు కృషి చేశారని పేర్కొన్నారు.

“నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కావడానికి కృషి చేసిన నాయకులందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. దైవానుగ్రహం వల్ల ఆమె త్వరలోనే విడుదలై భారతదేశానికి వస్తారు. నిమిషను తీసుకురావడం కోసం దౌత్యవేత్తలను పంపడానికి సిద్ధంగా ఉన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

Also Read: కోట్లాది రూపాయలు.. భారత స్టార్ క్రికెటర్ల సంపాదనపై రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్‌.. వీరికి వస్తున్న డబ్బు గురించి తెలిస్తే..
భారత విదేశాంగ శాఖ ఏమంది?
ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇప్పటికే స్పష్టతనిచ్చింది. నిమిష ప్రియకు మద్దతుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వివరాలను వెల్లడించింది. ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. యెమెన్‌లో ప్రియ కుటుంబానికి సాయం చేయడానికి MEA ఒక న్యాయవాదిని నియమించిందని తెలిపారు. షరియా చట్టం కింద క్షమాభిక్ష లేదా క్షమాపణ కోరే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు.

“ఇది చాలా సున్నితమైన విషయం, భారత ప్రభుత్వం ఈ కేసులో అన్ని రకాలుగా సాయాన్ని అందిస్తోంది. మేము న్యాయ సాయాన్ని అందించాము. ఆమె కుటుంబానికి సాయం చేయడానికి ఒక న్యాయవాదిని కూడా నియమించాము. ఈ సమస్యను పరిష్కరించడానికి స్థానిక అధికారులతో, అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. యెమెన్‌లోని స్థానిక అధికారులు ఆమె మరణశిక్ష అమలును వాయిదా వేశారు” అని జైస్వాల్ చెప్పారు.

గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ కూడా ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. హత్యకు పాల్పడి మరణశిక్షకు సిద్ధంగా ఉన్న 37 ఏళ్ల నిమిష ప్రియ విడుదలకు యెమెన్‌లోని సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. తన చర్చల తర్వాత, ఉరిశిక్ష వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయని గ్రాండ్ ముఫ్తీ పేర్కొన్నారు. దీంతో నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడడంలో అధికారిక దౌత్య ప్రయత్నాలతో పాటు మతపరమైన ప్రభావం కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

గ్రాండ్ ముఫ్తీ మాట్లాడుతూ.. “ఇస్లాంలో మరణశిక్షకు బదులుగా దియా (పరిహారం) ఇచ్చే పద్ధతి కూడా ఉంది. నేను వారికి దియాత్‌ను అంగీకరించాలని అభ్యర్థించాను. నా అభ్యర్థనను అంగీకరించాలా? వద్దా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని రోజులు వాయిదా పడింది” అని అన్నారు.