Chandrababu-Jagan
ఏపీలో అధికార, ప్రతిపక్షాల పొలిటికల్ వార్ పీక్ లెవల్‌కు చేరుకుంది. ఇష్యూ ఏదైనా..సబ్జెక్ట్ మరేదైనా..రేపోమాపో ఎన్నికలున్నాయన్నట్లుగా..రాజకీయంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు రెండు పక్షాలు దీటుగా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు వైసీపీ నేతల అరెస్టులు, జగన్ టూర్ల రచ్చ నడుస్తుండగానే..సర్కారు నిధుల సేకరణపై పెద్ద దుమారమే లేస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా వైసీపీ ఫిర్యాదులు చేస్తుండని మండిపడుతన్నారు కూటమి నేతలు.
క్యాబినెట్ మీటింగ్‌లో కూడా సీఎం చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2వందల ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పంపి..ఏపీ ప్రభుత్వాన్ని అప్పు ఇవ్వొద్దన్ని వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆ మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబుకు అందించారట మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించి..మెయిల్స్ చేసిందెవరో గుర్తించి కేసులు పెట్టాలని ఆదేశించినట్లు వార్తలు రావడంతో..మెయిల్స్ రచ్చ ఇంకా హీట్‌ను పెంచుతోంది.
వైసీపీ హయాంలో బాండ్ల ద్వారా రూ.7 వేల కోట్ల అప్పు తేవాలనుకున్నారట. మరో రెండు వేల కోట్లు అదనంగా 9వేల కోట్ల అప్పులను బాండ్ల ద్వారా తేవడానికి చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తుందని అంటున్నారు. అయితే నిబంధనల పేరుతో వైసీపీ ఫిర్యాదు చేయడంతో రుణ ప్రయత్నాలు ఆలసమయ్యాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తాజా పోరు బయటకు వచ్చింది.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ APMDC బాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లు రుణం సమీకరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. పెట్టుబడిదారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపి ప్రభుత్వ రుణ ప్రయత్నాలను వైసీపీ అడ్డుకోవాలని చూసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందకుండా అభివృద్ధిని అడ్డుకోవాలని మాజీ సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని అంటోంది కూటమి సర్కార్.
APMDC బాండ్లను కొనుగోలు చేయకుండా జగన్‌తో పాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆర్థిక మంత్రి కేశవ్ ఆరోపించారు. వీరికి జర్మనీలో ఉంటున్న ఉదయ భాస్కర్ అనే వ్యక్తి అన్ని విధాలా సహకరించాడంటున్నారు. APMDC బాండ్లు కొనొద్దంటూ ఉదయ భాస్కర్ 200 మంది ఇన్వెస్టర్లకు ఈ-మెయిల్ పంపినట్లు అలిగేషన్స్ చేస్తున్నారు. హైకోర్టులో పిల్ వేయడమే కాకుండా..ప్రధాని, కేంద్ర ఆర్థిక, ఆర్బీఐ, సెబీ, ఇతర ఎక్సేంజ్‌లకు ఫిర్యాదులు చేయించారని ఫైర్ అవుతోంది కూటమి సర్కార్.
అయితే 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పంపారంటూ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది. రాజ్యాంగ విరుద్దంగా APMDC బాండ్ల జారీ జరిగిందన్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి..తప్పులను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని క్వశ్చన్ చేస్తున్నారు. రూ.9వేల కోట్ల కోసం APMDC బాండ్లు జారీ చేసి..రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు నేరుగా డ్రా చేసుకునే హక్కు మధ్యవర్తులకు కల్పించిన మాట నిజమా కాదా? అని ప్రశ్నిస్తున్నారు బుగ్గన.
గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా? దీనికి బదులివ్వకుండా, ఎందుకు మీరు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారని బుగ్గన ఎదురుదాడి స్టార్ట్ చేశారు. ఈ బాండ్లపై జోక్యం చేసుకోవాలని కోర్టుకెళ్తే రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా బాండ్ల జారీ ద్వారా ఏపీ ప్రభుత్వం తేవాలనుకున్న అప్పు మీద ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.