కాకాణి తర్వాత నెక్స్ట్‌ అరెస్ట్ ఎవరిది? ఇప్పటికే కొడాలి నానికి లుక్‌ అవుట్‌ నోటీసులు

మాజీ మంత్రులు విడదల రజిని, ఆర్కే రోజా కూడా కేసులు, ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు. విడదల రజినిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు అయింది.

Kakani Govardhan Reddy

ఒకరి తర్వాత ఇంకొకరి వంతు వస్తోంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఇలా నోరు జారినోళ్లు..నోటికొచ్చినట్లు మాట్లాడినోళ్ల ఎపిసోడ్‌ ఒక్కొక్కటిగా అయిపోతోంది. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డిగా చెప్పుకునే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎపిసోడ్‌ కూడా స్టార్ట్ అయిందంటున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై రెండు నెలల క్రితమే కేసు పెట్టారు పోలీసులు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్‌ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్‌ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.

ఈ గని లీజు కాలం ముగిశాక కూడా..వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని..అంతేకాక రాళ్ళను పేల్చేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఇష్యూ అయింది. ఈ ఇష్యూపై కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టింది. అప్పటి కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారంటున్నారు టీడీపీ నేతలు. ఎట్టకేలకు ఆయనను కేరళలో అరెస్ట్ చేసి..విజయవాడకు తరలించి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపించారు పోలీసులు.

నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని? 
ఇక నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది మాజీ మంత్రి కొడాలి నానినే అని బలంగా చర్చ జరుగుతోంది. కేసు విచారణకు సహకరించకపోవడంతో పాటు పారిపోతాడనే కారణంతో ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ వారెంట్ జారీ చేశారు. అయితే గత కొంత కాలం నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలినాని ఆరోగ్యం ఇంకా సెట్ కాలేదని..మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కృష్ణా జిల్లా పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

అయితే ఇప్పటికే కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌పై అసభ్యకరంగా మాట్లాడారని ఫైలయ్యాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూకబ్జాలకు సంబంధించి ఆరోపణలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న కాలనీలో మెరక పేరుతో రూ.45 కోట్ల అవినీతి, విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ ఆరోపణలు ఉన్నాయి. వీటిన్నింటిపై విచారణ జరుగుతోంది. ఓ వైపు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కొడాలి నాని హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆరోపణలు
ఇదే టైమ్‌లో లిక్కర్ స్కాం ఆరోపణలు కూడా వైసీసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను కస్టడీకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇప్పుడు ఈ ముగ్గురితో పాటు మరోసారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డినీ కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వాళ్లిచ్చే వివరాల ఆధారంగా ఓ వైసీపీ సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

కొడాలి నానిపై కేసులు, లిక్కర్ స్కామ్ ఆరోపణలే కాదు.. మాజీ మంత్రులు విడదల రజిని, ఆర్కే రోజా కూడా కేసులు, ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు. విడదల రజినిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు అయింది. ఓ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో..గుంటూరు అప్పటి ఎస్పీతో పాటు సీఐ, విడదల మరిది గోపి, ఆమె పీఏతో పాటు విడదల రజినిపై కూడా ఏసీబీ FIR కట్టింది.

మాజీ మంత్రి ఆర్కే రోజా టార్గెట్‌గా ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రామ్‌కు సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్‌గా అటవీ భూముల ఆక్రమణలపై దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసి..కూటమి నేతల టార్గెట్‌గా విమర్శలు చేసిన లీడర్లను వరుస కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టుల ఎపిసోడ్‌లో నెక్స్ట్‌ ఎవరి వంతు వస్తుందో చూడాలి మరి.