Who Is AP New CS : ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాలని జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాయంత్రంలోగా ఏపీకి కొత్త సీఎస్ ను నియమించనున్నారు. మరోవైపు సలహాదారులను తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశించారు. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది కొత్త ప్రభుత్వం.
అటు.. అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ సెలవుపై వెళ్లారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో కొద్ది రోజుల్లో ఏజీపీలు, ఏపీపీలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది.
ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ కు ఎవరు అనుకూలంగా ఉంటారు? ఎవరు సన్నిహితులుగా ఉంటారు? అనే జాబితాను కొత్త ప్రభుత్వం తయారు చేసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడేందుకు ముందుగా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దే పనిలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సకాలంలో పెన్షన్లు చేతికి అందక తాము ఎలాంటి ఇబ్బందులు పడతామో అనే అభిప్రాయాన్ని క్రియేట్ చేసే విధంగా జవహర్ రెడ్డి ప్రయత్నించారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.
తనను కలిసి అభినందనలు తెలిపేందుకు వచ్చిన సీఎస్ జవహర్ రెడ్డితో చంద్రబాబు ముభావంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని తొలిగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయం జవహర్ రెడ్డికి కూడా తెలుసు. లీవ్ లో వెళ్లాల్సిందిగా జవహర్ రెడ్డికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. తన ప్రమాణ స్వీకారం కూడా జవహర్ రెడ్డి చేతుల మీదుగా జరిగేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదని సమాచారం.
ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకం కోసం చంద్రబాబు టీమ్ కసరత్తు చేస్తోంది. విజయానంద్, సాయిప్రసాద్ వంటి సీనియర్ల పేర్లు కొత్త సీఎస్ రేసులో వినిపిస్తున్నాయి.
Also Read : ఏపీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ జోరు.. ధర్మాన సోదరులకు భంగపాటు