ఏపీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ జోరు.. ధర్మాన సోదరులకు భంగపాటు

ఈసారి ఏపీ ఎన్నికల్లో అయితే బరిలోకి దిగిన రాజకీయ కుటుంబాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏపీ ఎన్నికల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, బాబాయ్ అబ్బాయిలు పోటీ చేయగా..

ఏపీ ఎన్నికల్లో బాలయ్య ఫ్యామిలీ జోరు.. ధర్మాన సోదరులకు భంగపాటు

AP Political Families: వారసులు, అన్నదమ్ములు, ఒకే కుటుంబ నుంచి పలువురు ఎన్నికల్లో పోటీ చేయడం కామన్. గెలుపోటములు మాత్రం డిఫరెంట్. కొందరు బంపర్ మెజార్టీతో గెలిస్తే మరికొందరికి మాత్రం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈసారి ఏపీ ఎన్నికల్లో అయితే బరిలోకి దిగిన రాజకీయ కుటుంబాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏపీ ఎన్నికల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, బాబాయ్ అబ్బాయిలు పోటీ చేయగా.. కొందరు గెలిచారు. మరికొందరు ఓడిపోయారు.

ధర్మాన సోదరులకు భంగపాటు
వైసీపీ తరపున శ్రీకాకుళం నుంచి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీ చేసిన ధర్మాన కృష్ణదాస్‌ ఇద్దరు ఓడిపోయారు. అలాగే అంబటి రాంబాబు సత్తెనపల్లిలో.. అంబటి మురళి పొన్నూరులో పరాజయం పాలయ్యారు. వై వెంకట్రామిరెడ్డి గుంతకల్లులో, వై సాయిప్రసాద్ రెడ్డి ఆదోనిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వీరి మరో సోదరుడు మంత్రాలయం నియోజకవర్గం నుంచి వై బాలనాగిరెడ్డి మాత్రం గెలిచారు. మరోవైపు బీజేపీ టికెట్‌పై రాజంపేటం ఎంపీగా పోటీ చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓడిపోగా.. ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పీలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి గెలవగా.. ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి తంబళ్లపల్లె నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి గెలిచారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం.. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడారు.

అన్నయ్య గెలుపు.. చెల్లెలు ఓటమి
వైసీపీ అధినేత జగన్‌ పులివెందుల ఎమ్మెల్యేగా గెలవగా.. ఆయన చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా విజయం సాధించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు.. మంగళగిరిలో ఆయన తనయుడు నారా లోకేశ్‌ విజయాన్ని అందుకున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయారు. టెక్కలిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కింజారపు అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్‌నాయుడు గెలిచారు.

బాలయ్య ఫ్యామిలీ జోరు
జమ్మలమడుగులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గెలవగా.. కడప ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డి ఓడిపోయారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలవగా.. ఆయన అల్లుడు నారాలోకేష్ మంగళగిరిలో.. మరో అల్లుడు భరత్‌ విశాఖ ఎంపీగా గెలుపొందారు. ఆమదాలవలసలో తమ్మినేని సీతారాంపై టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌ గెలిచారు. వీళ్లిద్దరు మామ, మేనళ్లులు అవుతారు. కమలాపురంలో వైఎస్ జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డి ఓడిపోయారు.

Also Read: నగరికి పట్టిన శని వదిలింది.. రోజాపై నగరి వైసీపీ నాయకురాలు కేజే శాంతి ఫైర్

రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు.. శ్రీకాకుళం ఎంపీగా కింజారపు రామ్మోహన్‌నాయుడు విజయం సాధించారు.. వీళ్లు బావ, బామ్మర్దులు. ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డి ఓడిపోయారు. వీళ్లకు కూడా బావ, బామ్మర్దుల బంధుత్వం ఉంది. అంతేకాదు రాజమండ్రి ఎంపీగా గెలిచిన పురందేశ్వరి కూడా నారా, నందమూరి కుటుంబాలకు బంధుత్వం ఉంది.

Also Read: నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు: జక్కంపూడి రాజా ఆవేదన

వైసీపీలో వారసుల ఓటమి
రాజకీయ కుటుంబాలే కాదు.. కూటమి సునామీలో వైసీపీ వారసులు కొట్టుకుపోయారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పరాజయం పాలయ్యారు.