కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలెవరు? జనసేనాని బ్రదర్‌ కేంద్రమంత్రి కాబోతున్నారా?

జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో.. నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు..

బంపర్ మెజార్టీతో గెలిచినా రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. టీడీపీ నేతలు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే మరో రెండుమూడేళ్లు వెయిట్‌ చేయకతప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ముగ్గురు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యులు..రిజైన్‌ చేశారు. సీఎం చంద్రబాబు బాబు మార్క్ పాలిటిక్స్‌తో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు సీట్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి. దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీ నుంచి 11 మంది వైసీపీ నేతలనే ఎంపీలుగా ఉన్నారు. మొత్తం కోటా అంతా వైసీపీతో భర్తీ అయింది. దాంతో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ పరిణామంతో నిరాశ చెందిన టీడీపీ అధికారంలోకి రాగానే తన మార్క్‌ పాలిటిక్స్‌తో పావులు కదిపింది. దానికి తగినట్లుగా వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. జగన్ ఎవరి మీద అయితే నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే ఫ్యాన్‌ పార్టీకి బైబై చెప్పి మరీ సైకిలెక్కేందుకు రెడీ అయ్యారు.

తమ పదవులను వదిలేసుకున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైకిల్ ఎక్కాలనుకుంటే.. ఆర్‌.కృష్ణయ్య మాత్రం బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూడు ఖాళీల్లో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారనేది చర్చకు దారి తీసింది. మూడు సీట్లు ఖాళీగా ఉంటే నాలుగురైదుగురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీకి దక్కే స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ ముగ్గురిని చంద్రబాబు సెలెక్ట్‌ చేశారా?
ప్రచారంలో ఎందరి పేర్లున్నా..పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురిని చంద్రబాబు సెలెక్ట్‌ చేశారని తెలుస్తోంది. టీడీపీకి రెండు ఎంపీలు, జనసేనకు ఒకటి ఇస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దలసభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ రెండు, జనసేన ఒకటి తీసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటన్నదానిపై క్లారిటీ లేదు. అయితే బీజేపీకి ఈసారికి నచ్చచెబుతారని ఎమ్మెల్సీ కోటాలో చాన్స్ ఇస్తారని అంటున్నారు.

ఇక టీడీపీ దక్కే సీట్లలో ఒకటి మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌కి, మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి, సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అశోక్ గజపతి రాజును తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గల్లా జయదేవ్ వంటి వారు పెద్దలసభలో అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట.

అప్పుడు నాగబాబు సీటు త్యాగం
ఇక జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో.. నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి లోక్‌సభ సీటును ఆశించారు. కూటమి పొత్తుల్లో భాగంగా..అనకాపల్లి నుంచి బీజేపీ సీఎం రమేశ్‌కు టికెట్‌ ఇచ్చారు.

అప్పుడు నాగబాబు సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడాయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇలా మూడు ఎంపీ సీట్లకు గానూ అభ్యర్ధులతో సహా ఎంపికలు పూర్తి అయ్యాయని చర్చ జరుగుతోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కావడమే కూడా కన్ఫామే అంటున్నారు కూటమి నేతలు.

Konda Surekha: మీడియా ముందు కొండా సురేఖ కన్నీరు.. భావోద్వేగభరిత వ్యాఖ్యలు