why chandrababu, ys jagan performed raja shyamala yagam explained here
raja shyamala yagam: యాగంతో యోగం సిద్ధిస్తుందా..? రాజ్యకాంక్ష తీర్చేలా రాజ్యలక్ష్మి అనుగ్రహం లభిస్తుందా? ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునే ముందు.. యజ్ఞాలు, యాగాలతో భూత శాంతి చేయకతప్పదా? రాజకీయానికి రాజశ్యామల యాగానికి లింకేంటి? రాజశ్యామల ఆశీస్సులు ఉంటే నేరుగా అధికారం పీఠం ఎక్కేయొచ్చా..?
యజ్ఞ యాగాదులు.. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి. అధికారం దక్కాలంటే యాగాలు చేయాల్సిందే అన్నట్లు మారింది పరిస్థితి. ఎన్నికల్లో వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో.. యజ్ఞాలు చేయడం అంతేముఖ్యమని నమ్ముతున్నారు మన నేతలు. కొన్నేళ్లుగా ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేయడం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యంగా మారింది. 2018 ఎన్నికలకు ముందు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం చేసి అధికారం దక్కించుకున్నప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నేతలు.. రాజ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేసినా ఫలితం దక్కలేదు. కానీ, ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఇద్దరూ ఇప్పుడు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సుల కోసం ఆధ్యాత్మిక బాట పడుతుండటమే ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. తాజాగా సీఎం జగన్ కూడా విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల యాగం ముగింపు క్రతువుకు వెళ్లారు. గత ఎన్నికలకు ముందు కూడా సీఎం జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు.
వ్యూహాలకు తోడుగా దైవబలం
రాజ్యకాంక్ష తీరాలని.. ప్రత్యర్థుల బలం నశించాలని.. శత్రువులపై పైచేయి సాధించాలని రాజశ్యామల యాగం నిర్వహిస్తుంటారు. నిష్టతో యాగం చేస్తే తమ మనోవాంఛ ఫలిస్తుందని నమ్ముతారు. ఎన్నికల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలకు తోడుగా దైవబలం ఉండాలనే భావనతో యాగాలు చేస్తున్నారు నాయకులు. ఒకప్పుడు ఎన్నికలకు ముందు ఇలాంటి సంస్కృతి ఉండేది కాదు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభావంతో క్రమంగా రాజకీయాల్లో యాగాల ప్రాముఖ్యత పెరిగిపోయింది. చంద్రబాబు మూడు రోజుల పాటు యాగం చేయగా, సీఎం జగన్ విశాఖ శారదపీఠంలో జరిగిన యాగం ముగింపు వేడుకలకు వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు.
Also Read: వైసీపీలో ఏమైనా జరగొచ్చు, గెలిచే సీటుని వదిలేసుకోవడం కరెక్ట్ కాదు- జలీల్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
విజయం ఎవరిని వరిస్తుందో..
మంత్రాలకు చింతకాలయలు రాలుతాయా? లేదా? అన్నది పక్కనపెడితే.. మంత్ర, తంత్రాలతో మనోధైర్యం కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యనేతలు. ఎన్నికల్లో ఎవరో ఒకరే విజయం సాధిస్తారు. అయినా రాజశ్యామల యాగంతో తమ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తామని.. తమదే అధికార పీఠమని నమ్మకం పెట్టుకుంటున్న ఇద్దరు ముఖ్య నేతల్లో విజయం ఎవరిని వరిస్తుందో.. అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుందో చూడాల్సివుంది.