శ్రీకాకుళంలో YCP ఆఫీసును ఎందుకు మార్చారు ? ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తా? ఆర్థిక భారమా?

YCP office in Srikakulam : తమ్ముడు పట్టించుకోలేదు. బాధ్యత ఉంది కాబట్టి అన్నయ్యే పట్టించుకోవాల్సి వచ్చింది. సిక్కోలులో వైసీపీ కార్యాలయానికి బూజుపట్టిన పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇద్దరు మంత్రులు, స్పీకర్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆ జిల్లాలో పార్టీ కార్యాలయానికి ఈ దుస్తితి ఎందుకు ఏర్పడింది. ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తా? లేక ఆర్థిక భారమా? ఏదైతే ఏం ఉందిలే తమ్ముడు పట్టించుకోలేని కార్యాలయ నిర్వాహణ బాధ్యతను అన్నయ్యే భుజాన వేసుకున్నాడు.

శ్రీకాకుళం జిల్లా రాజకీయ చైతన్యం :-
రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో అధికార వైసిపి కార్యాలయం మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు శ్రీకాకుళం నగరంలోని టౌన్‌హాల్‌ లో ఉండే జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఉన్నట్లుండి సూర్యమహల్ జంక్షన్‌లో గ్యాస్ గొడౌన్‌కు మార్చడమే ఇందుకు కారణమట. వైసీపీ సీనియర్ నేతగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2014 ఎన్నికలకు ముందు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా తానే చూసుకునే వారు. పార్టీ అధికారంలోనికి వస్తే మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నందున ముందు నుంచే పార్టీ కార్యాలయం బాధ్యతలు తానే తీసుకున్నారని అప్పట్లో అతని అనుచరులు చెబుతుండేవారు.

ధర్మాన అసంతృప్తి :-
2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే ధర్మాన ప్రసాదరావును కాదని అతని సోదరుడు ధర్మాన కృష్ణదాసుకు అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి మంత్రి పదవి కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో మరో సీనియర్‌ నేత తమ్మినేని సీతారాంకు ఏపి శాసనసభ స్పీకర్‌ పదవిని కట్టబెట్టారు. రాష్ట్రమంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికకావడంతో… ఆయన స్థానంలో జూనియర్‌ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి కేటాయించారు. అప్పట్నుంచి సీనియర్ నేత ధర్మాన అసంతృప్తితో ఉన్నారట.

కార్యాలయ నిర్వాహణ ఖర్చు :-
ధర్మానలో చెలరేగిన అసంతృప్తే పార్టీ కార్యాలయం నిర్వహణపై పడిందనేది సిక్కోలు రాజకీయాల్లో జోరుగా నడుస్తోన్న చర్చ. జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ ఉన్నప్పటికీ జిల్లా పార్టీ కార్యాలయ బాధ్యతలు పట్టించుకోకపోవడంతో.. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా నాకెందుకులే అని పట్టించుకోవడం మానేశారంటున్నారు.. మరో వైపు పార్టీ కార్యాలయం తన నియోజకవర్గ పరిధిలో ఉండటంతోనే ఇన్ని రోజులు ఆర్ధిక భారాన్ని మోశారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయ నిర్వహణ ఖర్చు తడిపిమోపిడైందని.. అందుకే ఆయన కూడా పట్టించుకోవడం మానేశారంటున్నారు. దాదాపు తొమ్మిది నెలల నుండి చెల్లించాల్సిన కార్యాలయం అద్దెను చెల్లించిన ధర్మాన ప్రసాదరావు… ఇక మాకొద్దు ఈ భారం మహప్రభో అని యజమానితో చెప్పినట్లు సమాచారం.

కొత్త కార్యాలయం ఏర్పాటు :-
కార్యాలయం యజమాని ఇదే విషయాన్ని మంత్రి కృష్ణదాసు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ చేయించారట. దీనికి తోడు కొత్త కార్యాలయాన్ని మంత్రి ధర్మాన కృష్ణదాసు ఎంపిక చేయడంతో ఈ వాదనకు బలం చేకూరుతోందంటున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ ఇంఛార్జ్‌ కిల్లి కృపారాణి, మంత్రి ధర్మాన కృష్ణదాసు సతీమణి ధర్మాన పద్మ ప్రియ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారని అంతా భావించారు.. కానీ చివరకు ఎవరూ రాకపోవడంతో కార్యక్రమాన్ని నిరాండబరంగా ముగించాల్సి వచ్చిందట.

అవమానం భావిస్తున్నారా :-
శ్రీకాకుళం నగరంలోని టౌన్‌హాల్‌లో ఉన్న పాత పార్టీ కార్యాలయం యజమానికి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు ఉన్న వ్యాపార లావాదేవీలను అధిష్టానానికి చూపించి బలవంతంగా ఖాళీ చేయించినట్లు నిరూపించాలనే తెరచాటు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న ఓపెన్ టాక్. టౌన్‌హాల్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత పార్టీకి బాగా కలిసొచ్చిందని, అదే వేధికగా అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వహించిన యువభేరీ కార్యక్రమం గ్రాండ్ సక్సస్ అయిందనే విషయాన్ని కూడా అధిష్టానానికి గుర్తి చేస్తున్నారట. అయితే నాయకుల రాజకీయాల మాట ఎలాగున్నా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రం పార్టీ కార్యాలయం మార్పును అవమానంగా భావిస్తున్నారట.

వైసీపీలో మరో తలనొప్పి :-
పార్టీ అధికారంలో ఉండి కూడా బలవంతంగా కార్యాలయాన్ని ఖాళీ చేసి వేరొక చోటకు తరలివెళ్లడాన్ని తట్టుకోలేకపోతున్నారట. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన టీడీపీ, పత్తాలేని కాంగ్రెస్‌కు రాజభవనాల్లాంటి కార్యాలయాలు ఉండగా.. అధికారంలో ఉన్న తమకు సరైన అద్దె భవనం కూడా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వచ్చి నిర్వహణ ఖర్చు పార్టీ అధిష్టానం భరించేలా ఒప్పించలేకపోతున్నారా అని సొంత పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారట. ఏదైతేనేం.. చివరికి పార్టీ ఆఫీసు తరలింపు వైసీపీలో మరో తలనొప్పిగా మారిందంటున్నారు.