సడెన్‌గా పవన్ కల్యాణ్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ఫ్యాన్ పార్టీ లీడర్లు

అధికారం కోల్పాయాక వైసీపీకి తత్వం బోధపడిందా?

Pawan Kalyan

ఫ్యాన్ పార్టీ లీడర్లు టోన్ మార్చారు. ఒకప్పుడు పవన్ పేరెత్తితే చాలు ఒంటి కాలు మీద లేచే నాయకులు ఇప్పుడు స్వీట్ వాయిస్ వినిపిస్తున్నారు. హి ఈజ్ స్వీట్..హి ఈజ్‌ సో క్యూట్..సరిలేరు మీకెవ్వరూ అంటూ సేనానికి సోప్ ఏస్తున్నారు. కొన్నాళ్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి వైసీపీ నేతల స్వరం మారుతోంది.

మొన్నటి వరకు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేతలు కూడా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఏకంగా ఆయన తోప్..డేర్ పర్సన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆరు నెలల క్రితం వరకు వైసీపీ అధినేత జగన్‌తో పాటు పార్టీ నేతలంతా పవన్‌ను తీవ్రస్థాయిలో విమర్శించడంతో పాటు అతడి వ్యక్తిగత జీవితంపై కూడా అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడేమో సేనాని గొప్ప ఆదర్శవంతమైన నాయకుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

విజయసాయిరెడ్డి ట్వీట్‌ ఫుల్ వైరల్‌
లేటెస్ట్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ ఫుల్ వైరల్‌ అవుతోంది. ఏపీలోని ఎన్డీయే నేతల్లో పవన్ ఆదర్శవంతమైన నాయకుడంటూ పొగిడారు. జాతీయ స్థాయిలో ప్రజాదరణ కలిగి ఉండటంతో పాటు వయస్సు రీత్యా పవన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా అనే రీతిలో విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు కూటమి పార్టీ నేతల్లో పవన్ సరైన వ్యక్తి అని నమ్ముతున్నానంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీలో విలేకర్ల సమావేశంలోనూ పవన్ను ప్రశంసించారు. అయితే విజయసాయి రెడ్డి స్వరం మారడం వెనుక కారణాలేమిటనే చర్చ జోరుగా సాగుతోంది.

మరోవైపు ఈ మధ్యే మాజీ మంత్రి పేర్ని నాని కూడా పవన్ కల్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవటంపై అభినందించారు. అయితే పేర్నినాని వ్యాఖ్యల్లో ప్రశంసలతో పాటుగా సెటైర్లు కూడా ఉన్నాయి. తన శాఖ కాకపోయినప్పటికీ ప్రాణాలకు తెగించి రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవటం అభినందనీయమంటూ పవన్‌ను మెచ్చుకున్నట్లు మాట్లాడారు పేర్నినాని.

ఇక అంతకముందు పీఏసీ ఎన్నికల సందర్భంగా..అసెంబ్లీ ఆవరణలో పవన్‌ను ఆలింగనం చేసుకున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పవన్‌ కారు ఎక్కడానికి వస్తున్నడాన్ని గమనించి వెయిట్‌ చేసి మరీ ఎదురుగా నిలబడి నమస్కారం చేశారు బొత్స. ప్రతి నమస్కారం చేసిన పవన్‌.. బొత్సను హగ్ చేసుకుని పలకరించి వెళ్లిపోయారు. ఇలా వైసీపీలో అధినేత తరఫున గళం వినిపించే నేతలంతా సేనానిని పొగడటం హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు, లోకేశ్‌ కంటే పవనే బెటర్‌ అని మాట్లాడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరు నేతలు కాస్త సున్నితంగా వెళ్తున్నారు. పవన్‌ మాత్రం దూకుడుకు పదును పెడుతున్నారు. ఎక్కడ ఏ వైసీపీ నేత అక్రమాలు చేస్తున్నారని తెలిసినా వెంటనే ఫీల్డ్‌లోకి దిగడమే కాదు..యాక్షన్‌ తీసుకునే వరకు తగ్గడం లేదు. ఇదే ఫ్యాన్ పార్టీ లీడర్లను భయపెడుతోందట. సేనానిని విమర్శిస్తే..తిరిగి ఇచ్చి పడేస్తాడని..ఆయన జోళికి వెళ్లడం కంటే సాఫ్ట్‌గా మాట్లాడటమే బెటర్ అని అనుకుంటున్నారట.

వైసీపీకి తత్వం బోధపడిందా?
ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ క్రేజ్ ఏంటో వైసీపీకి అర్థమైందంటున్నారు. అధికారం కోల్పాయాక వైసీపీకి తత్వం బోధపడిందా? డిప్యూటీ సీఎం పవన్‌ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించారా..? తమ రాడార్ నుంచి పవన్‌ను తప్పిస్తేకానీ, పార్టీ తలరాత మారదని గ్రహించారా.? పవన్‌తో పెట్టుకుంటే మటాషే అని భయపెడుతున్నారా.? లేక పవన్‌ను ప్రసన్నం చేసుకుంటే ఈ ఐదేళ్లు బతికిపోయినట్లే అని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ..డిప్యూటీ సీఎం పవన్‌పై మాత్రం మెతక వైఖరి ఫాలో అవుతుందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడం, సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో వైసీపీకి తెలిసి వస్తుందని.. అందుకే ఆ పార్టీ లీడర్లు వ్యూహాన్ని మార్చారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ..పవన్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారన్న విషయమే తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సేనానిని టార్గెట్ చేస్తే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజికవర్గం మరింత దూరం అవుతుందని కూడా వైసీపీ నేతలు కలవరపడుతున్నారట. అందుకే పవన్‌ ఈజ్ బెటర్..హి ఈజ్ డైనమిక్..ఆయనే నెంబర్ వన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. చూడాలి మరి వైసీపీ సోప్‌కు పవన్‌ ఎలా రియాక్ట్ అవుతారనేది.

Pawan Kalyan – Allu Arjun : కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ.. అల్లు అర్జున్ కామెంట్స్.. విబేధాలు.. వివాదాలు ముగిసినట్టేనా?